CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 28 July 2026, 9:32 pm Posted by : CHAITHANYA GALAM NEWS

అమరావతి అంటే 29 గ్రామాలు కాదు..విజయవాడ–గుంటూరుతో కలిసి సమగ్ర అభివృద్ధి: సీఎం చంద్రబాబు

పదేళ్లలో మూడు నగరాలు ఒకే మెట్రోపాలిటన్ ప్రాంతంగా రూపుదిద్దుకుంటాయి.. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణమే లక్ష్యం

అమరావతి(చైతన్యగళం): అమరావతి అంటే కేవలం 29 గ్రామాల పరిధి కాదని, విజయవాడ–గుంటూరు–మంగళగిరితో కలిసి అభివృద్ధి చెందే విశాల మెట్రోపాలిటన్ ప్రాంతమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణాన్ని గ్రామాలకే పరిమితం చేయకుండా, మొత్తం ప్రాంతాన్ని ఆర్థికాభివృద్ధికి కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

అమరావతి భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలపై మాట్లాడిన సీఎం, రాబోయే పదేళ్లలో అమరావతి, విజయవాడ, గుంటూరు నగరాలు పరస్పరం అనుసంధానమై ఒకే మెట్రోపాలిటన్ క్లస్టర్‌గా రూపుదిద్దుకుంటాయని పేర్కొన్నారు. మెరుగైన రహదారులు, ఔటర్ రింగ్ రోడ్, వేగవంతమైన రవాణా వ్యవస్థ, ఆధునిక మౌలిక సదుపాయాల ద్వారా ఈ ప్రాంతాన్ని అంతర్జాతీయ పెట్టుబడులకు ఆకర్షణీయ గమ్యస్థానంగా తీర్చిదిద్దనున్నట్లు వెల్లడించారు.

రాజధాని నిర్మాణం అంటే ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు మాత్రమే కాదని, ఉపాధి, పరిశ్రమలు, ఐటీ, విద్య, వైద్య రంగాల విస్తరణతో కూడిన సమగ్ర నగరాభివృద్ధి నమూనాను అమలు చేస్తున్నామని చంద్రబాబు వివరించారు.

అమరావతి అభివృద్ధి ఫలితాలు ఒక్క రాజధాని ప్రాంతానికే పరిమితం కాకుండా, విజయవాడ, గుంటూరు, మంగళగిరి పరిసర ప్రాంతాల ప్రజల జీవనోపాధి, వ్యాపారాలు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలకు కూడా కొత్త ఊపునిస్తాయని సీఎం పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అమరావతి కీలక వృద్ధి కేంద్రంగా మారుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.