CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 27 July 2026, 4:03 pm Posted by : CHAITHANYA GALAM NEWS

హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌కు హైకోర్టు బిగ్‌ షాక్‌

కమిషనర్‌ పదవి నుంచి తొలగించాలని సీఎస్‌కు ఆదేశాలు.. కోర్టు ధిక్కరణ వ్యవహారంలో తీవ్ర వ్యాఖ్యలు

హైదరాబాద్, జూలై 27(చైతన్యగళం): హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. లోతుకుంట భూముల వ్యవహారానికి సంబంధించిన కోర్టు ధిక్కరణ (కాంటెంప్ట్‌) కేసు విచారణ సందర్భంగా, రంగనాథ్‌ను హైడ్రా కమిషనర్‌ పదవి నుంచి తొలగించి, ఆయన స్థానంలో అర్హత కలిగిన అధికారిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌)ను హైకోర్టు ఆదేశించింది.

విచారణ సందర్భంగా కోర్టు ఉత్తర్వుల అమలుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం, ఉన్నతాధికారులు న్యాయస్థానాల ఆదేశాలను తప్పనిసరిగా అమలు చేయాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేసింది. కోర్టు ఉత్తర్వులను అమలు చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే అది న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దెబ్బతీసే అంశంగా పరిగణించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించినట్లు సమాచారం.

ఈ కేసులో రంగనాథ్ తరఫున దాఖలైన అఫిడవిట్‌లో, కోర్టు ఆదేశాలను ఉల్లంఘించే ఉద్దేశం తమకు ఎప్పుడూ లేదని, న్యాయవ్యవస్థ పట్ల పూర్తి గౌరవం ఉందని వివరించినట్లు తెలిసింది. అయినప్పటికీ, కేసులోని పరిణామాలను పరిశీలించిన ధర్మాసనం కమిషనర్‌ పదవి నుంచి ఆయనను తప్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

అదే సమయంలో రంగనాథ్‌పై పెండింగ్‌లో ఉన్న ఇతర కోర్టు ధిక్కరణ పిటిషన్ల అంశాన్ని కూడా హైకోర్టు ప్రస్తావించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రభుత్వ చర్యలపై ఆసక్తి నెలకొంది.

హైకోర్టు తాజా ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? కమిషనర్‌ మార్పుపై వెంటనే చర్యలు చేపడుతుందా? లేక న్యాయపరంగా తదుపరి చర్యలు, అప్పీల్‌ వంటి మార్గాలను అనుసరిస్తుందా? అన్న అంశాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

ప్రభుత్వం నుంచి అధికారిక స్పందన వెలువడాల్సి ఉండగా, హైడ్రా భవిష్యత్‌ పరిపాలనపై ఈ పరిణామాలు కీలక ప్రభావం చూపే అవకాశం ఉందని న్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.