CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 27 July 2026, 12:30 pm Posted by : CHAITHANYA GALAM NEWS

కరీంనగర్‌లో మౌలిక వసతుల పనులకు శంకుస్థాపన

కరీంనగర్(చైతన్యగళం):
కరీంనగర్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే నగర పాలక సంస్థ లక్ష్యమని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు.

నగరపాలక సంస్థ 2వ డివిజన్ చంద్రపూరి కాలనీ తిలక్‌నగర్‌లో మున్సిపల్ సాధారణ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు స్థానిక కార్పొరేటర్ హోదాలో మేయర్ శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. అనంతరం 21వ డివిజన్ శ్రీరాంనగర్ కాలనీలో మున్సిపల్ సాధారణ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు మరియు సీసీ డ్రైన్ పనులకు శంకుస్థాపన చేసి, పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, “ప్రతి డివిజన్‌లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను ప్రాధాన్య క్రమంలో కల్పిస్తూ నగరాభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్నాం. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులను వేగవంతంగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలి” అని సూచించారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వై. సునీల్ రావు, 21వ డివిజన్ కార్పొరేటర్ వరాల నర్సింగం, 26వ డివిజన్ కార్పొరేటర్ వైద్యుల అంజన్ కుమార్, మున్సిపల్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, డివిజన్ వాసులు పాల్గొన్నారు.