కరీంనగర్, జూలై 27 (చైతన్యగళం):
తెలంగాణ ఉద్యమంలో ఆటో కార్మికుల పాత్ర మరువలేనిదని, వారి హక్కుల సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
ఆగస్టు 1న కరీంనగర్‌లో జరగనున్న ఆటో కార్మిక దినోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వాల్‌పోస్టర్లను ఆవిష్కరించి, కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఆటో కార్మికులకు అందించిన సంక్షేమ ఫలాలను, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు.
ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో ఆటో కార్మికులు ఉద్యమకారులకు ఉచిత ప్రయాణాలు కల్పించి తమ మద్దతు తెలిపారని, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ఆటో కార్మికులను అన్ని విధాలుగా ఆదుకున్నామని గంగుల గుర్తుచేశారు. ప్రమాదవశాత్తు ఆటో కార్మికుడు మరణిస్తే రూ.5 లక్షల ప్రమాద బీమా, రోడ్ టాక్స్ మాఫీ వంటి సౌకర్యాలు కల్పించామని తెలిపారు.
ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం వల్ల ఆటో కార్మికులు ఉపాధి కోల్పోయారని, ప్రభుత్వం ప్రకటించిన నెలకు రూ.1,000 ఆర్థిక సహాయం ఇప్పటివరకు అమలు కాలేదని ఆయన ఎత్తిచూపారు. “ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు కార్మికుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుంది” అని గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.
ఆటో కార్మిక సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, కేసీఆర్ హయాంలో అమలైన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆ పథకాలను పునరుద్ధరించాలని, రూ.12 వేల సహాయం అందించాలని, ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, ఆటో కార్మిక సంఘం నాయకులు, మాజీ కార్పొరేటర్లు, పలువురు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.