CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 27 July 2026, 2:49 pm Posted by : CHAITHANYA GALAM NEWS

డిఏపీ ఎరువుల అక్రమ విక్రయాలపై కాలెక్టర్ కు ఫిర్యాదు చేసిన బోగ శ్రావణి

జగిత్యాల, జూలై 27 (చైతన్య గళం):
జగిత్యాల జిల్లాలో రైతులకు ఎమ్మార్పీ ధర కంటే అధిక ధరలకు డి.ఏ.పీ. ఎరువులు విక్రయిస్తున్న డీలర్లపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ నాయకురాలు డా. బోగ శ్రావణి జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “డి.ఏ.పీ. ఎరువుల ఎమ్మార్పీ ధర రూ.1,350 మాత్రమే ఉన్నప్పటికీ, కొంతమంది డీలర్లు ఒక్కో బస్తాను రూ.1,950 వరకు విక్రయిస్తూ రైతుల నుండి అదనంగా రూ.600 వసూలు చేస్తున్నారు. వ్యవసాయ సీజన్‌లో రైతుల అత్యవసర అవసరాన్ని ఆసరాగా చేసుకుని కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్‌కు పాల్పడటం అత్యంత దురదృష్టకరం” అని ఆవేదన వ్యక్తం చేశారు.

రైతులు అధిక ధరలకు ఎరువులు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం నిర్ణయించిన ఎమ్మార్పీ ధరలకే ఎరువులు అందేలా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

అలాగే, అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తున్న డీలర్లు, షాపు యజమానులపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. “రైతుల ప్రయోజనాలను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత. రైతులకు న్యాయం జరిగే వరకు బీజేపీ వారి పక్షాన నిలుస్తుంది” అని డా. బోగ శ్రావణి స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు బద్దం తిరుపతి రెడ్డి, జిల్లా కార్యదర్శులు ముత్యం రెడ్డి, పాత రమేష్, మహిళా మోర్చా అధ్యక్షురాలు దూరిశెట్టి మమత, యువ మోర్చా అధ్యక్షుడు ఇత్తడి శేఖర్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు నారపక అశోక్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వేముల శ్రీనివాస్, జ్ఞానేశ్వర్ మరియు ఇతర జిల్లా, మండల పదాధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.