కరీంనగర్, జూలై 27 (చైతన్య గళం):
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) విధానాన్ని తక్షణమే రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) పునరుద్ధరించాలనే ప్రధాన డిమాండ్‌తో తెలంగాణ స్టేట్ సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా జన జాగరణ కార్యక్రమం ఉధృతంగా కొనసాగుతోంది.
ఈ కార్యక్రమంలో భాగంగా సంఘం ప్రతినిధులు కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ను ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను సానుకూలంగా విన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ, “సీపీఎస్ ఉద్యోగుల పక్షాన అసెంబ్లీలో గళం విప్పుతాం. వారి న్యాయమైన డిమాండ్ల సాధనకు సంపూర్ణ మద్దతు ఇస్తాం” అని హామీ ఇచ్చారు.
స్థిత ప్రజ్ఞ ఆవేదన
సంఘ రాష్ట్ర అధ్యక్షుడు స్థిత ప్రజ్ఞ మాట్లాడుతూ, జూలై 11న ప్రారంభించిన జన జాగరణలో భాగంగా రాష్ట్రంలోని 33 జిల్లాల్లో పర్యటిస్తూ మొత్తం 119 మంది ఎమ్మెల్యేలను కలుస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2.60 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయుల ఏకైక ఆకాంక్ష పాత పెన్షన్ పునరుద్ధరణేనని స్పష్టం చేశారు.
“సీపీఎస్ విధానం వల్ల రిటైర్డ్ ఉద్యోగులకు కేవలం రూ.3,000–4,000 మాత్రమే పెన్షన్ వస్తోంది. ఈ నామమాత్రపు మొత్తంతో కుటుంబ పోషణ భారంగా మారింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాత పెన్షన్ అమలు చేస్తామని హామీ ఇచ్చినా ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం బాధాకరం” అని ఆవేదన వ్యక్తం చేశారు.
డిమాండ్లు
ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం వెంటనే స్పందించి, సీపీఎస్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, రిటైర్డ్ ఉద్యోగుల దుస్థితిని దృష్టిలో ఉంచుకుని తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ సమావేశంలో టీఎస్‌సీపీఎస్‌ఈయూ ప్రతినిధులు, ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.