CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 26 July 2026, 9:11 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ఘనంగా గోరింటాకు సంబరాలు..

మహబూబాబాద్(చైతన్యగళం): మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్ఎస్వీఎల్ ఫంక్షన్ హాల్‌లో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని గోరింటాకు సంబరాలను ఘనంగా నిర్వహించారు. బొడ్ల రామకృష్ణ–నర్మద దంపతుల కోడలు బొడ్ల స్వప్నకు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, మహిళలు, సన్నిహితుల సమక్షంలో తల్లిదండ్రులు విజయ గోపి దంపతులు సంప్రదాయబద్ధంగా గోరింటాకు వేడుకలను నిర్వహించారు.

ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి, పాటలు పాడుతూ, ఆటపాటలతో సందడి చేశారు. ఒకరికొకరు గోరింటాకు పెట్టుకుంటూ ఆనందంగా గడిపారు. ఆషాఢ మాసంలో గోరింటాకు వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని, మహిళల మధ్య స్నేహబంధాన్ని, కుటుంబ అనుబంధాలను మరింత బలోపేతం చేసేలా ఈ కార్యక్రమం ఎంతో ఆహ్లాదకరంగా సాగిందని నిర్వాహకులు తెలిపారు.

వేడుకల సందర్భంగా ఫంక్షన్ హాల్‌లో పండుగ వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఉత్సాహంగా పాల్గొని నూతన వధువుకు శుభాకాంక్షలు తెలియజేశారు. సంప్రదాయాలు, సంస్కృతిని ప్రతిబింబించేలా నిర్వహించిన ఈ గోరింటాకు సంబరాలు అందరినీ ఆకట్టుకున్నాయి.