CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 25 July 2026, 6:51 pm Posted by : CHAITHANYA GALAM NEWS

విద్యార్థుల సమైక్య పోరాట ఫలితమే కేంద్ర మంత్రి రాజీనామా

  • విద్యా వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు చేపట్టాలి – ⁠లక్ష్మీ నర్సింహారెడ్డి

ఆమనగల్లు, జూలై 25 (చైతన్యగళం): కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దేశవ్యాప్తంగా విద్యార్థులు సాగించిన సమైక్య పోరాటానికి దక్కిన విజయమని రాష్ట్ర సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు జి. లక్ష్మీ నర్సింహారెడ్డి పేర్కొన్నారు. శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో చోటుచేసుకున్న లోపాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలు, అవకతవకలకు వ్యతిరేకంగా విద్యార్థులు చేసిన ఉద్యమానికి ఈ పరిణామం నైతిక విజయమని అన్నారు. దేశ భవిష్యత్తును నిర్మించే విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడిన ప్రభుత్వ తీరుపై వ్యక్తమైన ప్రజా ఆగ్రహానికి ఈ రాజీనామా నిదర్శనమని, యువత ఆకాంక్షలకు ప్రభుత్వం తలవంచక తప్పలేదని వ్యాఖ్యానించారు. రాజీనామాతోనే సరిపెట్టకుండా విద్యా వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు చేపట్టి పారదర్శక విధానాలను అమలు చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చట్టాలు అమలు చేయాలని కోరారు. అన్యాయానికి గురైన ప్రతి విద్యార్థికి న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని లక్ష్మీ నర్సింహారెడ్డి స్పష్టం చేశారు.