CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 25 July 2026, 5:47 pm Posted by : CHAITHANYA GALAM NEWS

₹60 లక్షలతో అత్యాధునిక ఐసీయూ అంబులెన్స్ ప్రారంభం

  • గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రూ.50 కోట్లతో మరిన్ని కార్యక్రమాలు: జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్

మహబూబాబాద్, జూలై 25(చైతన్యగళం): మారుమూల గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సుమారు రూ.50 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ తెలిపారు.

మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఈసీఐఎల్ సంస్థ సీఎస్ఆర్ నిధులు రూ.60 లక్షలతో సమకూర్చిన అత్యాధునిక ఐసీయూ అంబులెన్స్‌ను ఆయన శనివారం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధులతో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ అత్యాధునిక అంబులెన్స్ ద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు సకాలంలో వైద్యం అందించి అనేక ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని చెప్పారు.

ఈ జిల్లాలో ఇప్పటికే 3 వేల మంది రైతులకు పవర్ స్ప్రేయర్లు, విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేసినట్లు గుర్తుచేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తామని వెల్లడించారు.

కార్యక్రమంలో ఈసీఐఎల్ ప్రతినిధి ప్రతీక్ కుమార్ చక్రవర్తి, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసరావు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.