కడ్తాల్, జూన్ 25 (చైతన్యగళం): ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను కలిగి ఉండాలని, ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని జిల్లా సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుడు, రావిచేడ్ సర్పంచ్ బొప్పిడి గోపాల్ అన్నారు.
శనివారం కడ్తాల్ మండలం రావిచేడ్ గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొలి ఏకాదశి సందర్భంగా ఆయన హైమావతి దంపతులతో కలిసి సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు, హారతి కార్యక్రమాలు ఆలయ ప్రధాన అర్చకుడు శిరీష్ శర్మ ఆధ్వర్యంలో జరిగాయి.
ఈ సందర్భంగా సర్పంచ్ గోపాల్ మాట్లాడుతూ, “ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. హిందూ సంప్రదాయాలు, సనాతన ధర్మాన్ని ప్రపంచంలోని పలు దేశాలు మెచ్చుకుంటున్నాయి. మన ప్రాంతంలో సకాలంలో వర్షాలు కురిసి రైతులు పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని, ప్రతి కుటుంబం ఆనందంగా జీవించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాం” అని తెలిపారు.
కార్యక్రమంలో ఉప సర్పంచ్ బందరి యాదయ్య, మాజీ ఎంపీటీసీలు యాదయ్య, రంగయ్య, వసంత, వార్డు సభ్యుడు రమేష్, నాయకులు రమేష్ యాదవ్, బీరప్ప, రామస్వామి, పారేశా, సాయికుమార్, అర్చకులు రామచంద్ర రావు, మురళీధర్ రావు తదితరులు పాల్గొన్నారు.