CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 25 July 2026, 6:07 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ప్రజాగ్రహానికి ఎవరైనా తల వంచాల్సిందే – బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకుడు దారమోని గణేష్

కల్వకుర్తి, జూలై 25 (చైతన్యగళం):  నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ విషయంలో విద్యాశాఖ వైఫల్యం స్పష్టమైందని, విద్యార్థుల విజయం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర సింగ్ ప్రధాన్ రాజీనామాలో ప్రతిఫలించిందని బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకుడు దారమోని గణేష్ అన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “విద్యార్థులు, యువకులు, విద్యావేత్తలు ఎంతగా కోరినా కేంద్రం పెడచెవిన పెట్టడం వల్ల పరిస్థితి చేయి దాటింది. వాంగ్ చుక్ దీక్ష, కాక్రోచ్ జనతాపార్టీ ఆందోళన విషయంలో కేంద్రం అనుసరించిన వైఖరి సమంజసం కాదు. విద్యార్థులపై అమానుషంగా ప్రవర్తించడం ప్రతీ భారతీయుడ్ని కదిలించింది. అందుకే యావత్ దేశం మోడీ ప్రభుత్వంపై తిరగబడే పరిస్థితి వచ్చింది. ప్రజాగ్రహాన్ని గ్రహించిన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది” అని పేర్కొన్నారు.

అనేక మంది విద్యార్థులు నష్టపోయిన తర్వాత రాజీనామా చేయించడం, రైతులు మరణించిన తర్వాత సాగు చట్టాలను రద్దు చేసినట్లే ఆలస్యంగా తీసుకున్న నిర్ణయమని ఆయన విమర్శించారు. నీట్ వంటి జాతీయ పరీక్షల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా బాధ్యతగా వ్యవహరించాలని, డిజిటల్ విధానంలో పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

విద్యార్థుల ఉద్యమాన్ని రాజకీయ పార్టీలు హైజాక్ చేయడం వల్ల సమస్య పక్కదారి పడుతుందని హెచ్చరిస్తూ, ప్రభుత్వంలో ఉన్న వారు తామే అధికులమనే వైఖరిని విడనాడాలని గణేష్ అన్నారు. హామీల అమలు విషయంలోనే కాకుండా అనేక అంశాల్లో వైఫల్యం చెందిన రాష్ట్ర ప్రభుత్వం కూడా తాజా రాజకీయ పరిణామాలతో అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.