CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 25 July 2026, 5:38 pm Posted by : CHAITHANYA GALAM NEWS

మద్యం మత్తులో డ్రైవింగ్‌ చేస్తే ఇక కఠిన చర్యలు!

  • డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌పై పోలీసుల ఉక్కుపాదం.. నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలు సీజ్‌
  • నెహ్రూ సెంటర్‌ సహా పలుచోట్ల విస్తృతంగా వాహనాల తనిఖీలు

మహబూబాబాద్(చైతన్యగళం)‌: మద్యం సేవించి వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రూరల్‌ సీఐ అంజలి హెచ్చరించారు. జిల్లా ఎస్పీ డాక్టర్‌ శబరీష్‌ ఆదేశాల మేరకు రూరల్‌ సీఐ అంజలి, ట్రాఫిక్‌ ఎస్‌ఐ అరుణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని నెహ్రూ సెంటర్‌తో పాటు పలుచోట్ల పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులకు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పరీక్షలు నిర్వహించారు. హెల్మెట్‌ లేకుండా వాహనాలు నడుపుతున్న వారిని గుర్తించి కౌన్సెలింగ్‌ నిర్వహించడంతో పాటు హెల్మెట్‌ ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాల బారిన పడటమే కాకుండా ఇతరుల ప్రాణాలకు సైతం ముప్పు వాటిల్లే అవకాశం ఉందని పోలీసులు వివరించారు.

జిల్లా కేంద్రంలో అసాంఘిక కార్యకలాపాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వబోమని సీఐ అంజలి తెలిపారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని వాహనాల తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పేర్కొన్నారు. నంబర్‌ ప్లేట్‌లు లేకుండా, ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘిస్తూ తిరిగే వాహనాలను గుర్తించి సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపకుండా, తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించి ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు. తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడే బాధ్యత ప్రతి వాహనదారుడిపై ఉందని తెలిపారు.