CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 25 July 2026, 5:41 pm Posted by : CHAITHANYA GALAM NEWS

అనంతాద్రి ఆలయంలో తొలి ఏకాదశి సందడి

  • తెల్లవారుజాము నుంచే భక్తుల రాక.. ప్రత్యేక పూజలు, అభిషేకాలతో మారుమోగిన ఆలయం

మహబూబాబాద్, జూలై 25(చైతన్యగళం): హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పర్వదినంగా భావించే తొలి ఏకాదశి సందర్భంగా మహబూబాబాద్ పట్టణంలోని అనంతాద్రి దేవస్థానంలో భక్తుల సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి శ్రీమహావిష్ణువును దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తొలి ఏకాదశిని శయన ఏకాదశిగా కూడా పిలుస్తారు. ఈ రోజున శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో యోగనిద్రలోకి ప్రవేశిస్తారని భక్తుల విశ్వాసం. ఈ పర్వదినంతో చాతుర్మాస దీక్ష ప్రారంభమవుతుందని పురాణాలు చెబుతున్నాయి.

తెలుగు పండుగల పరంపరకు తొలి ఏకాదశి నాంది పలుకుతుందని భక్తులు భావిస్తారు. తొలి ఏకాదశి సందర్భంగా భక్తులు ఉపవాస దీక్షలు చేపట్టి, తులసీదళాలతో శ్రీమహావిష్ణువును పూజిస్తూ విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. పేదలకు అన్నదానం, వస్త్రదానం వంటి దానధర్మాలు నిర్వహించారు. ఉపవాసం, భక్తిశ్రద్ధలతో స్వామివారిని ఆరాధించడం ద్వారా పాప విమోచనం కలిగి, భగవంతుని అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం. అనంతాద్రి దేవస్థానంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాంగణమంతా భక్తుల గోవింద నామస్మరణతో మారుమోగింది. తొలి ఏకాదశి పర్వదినాన స్వామివారిని దర్శించుకోవడం విశేష పుణ్యఫలాన్ని ఇస్తుందని విశ్వసిస్తూ భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.