- 10 నెలలుగా జీతాల్లేక తీవ్ర ఇబ్బందులు.. ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్‌కు వినతి
మహబూబాబాద్: జూలై 25(చైతన్యగళం): తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్యాలియేటివ్ కేర్‌లో విధులు నిర్వహిస్తున్న సుమారు 60 మంది ఆయాలకు 10 నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ భూక్యా రాజేశ్వరి, ధరావత్ లక్ష్మీ, సంధ్య తదితరులు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. నెలల తరబడి జీతాలు అందకపోవడంతో కుటుంబ పోషణతో పాటు పిల్లల విద్యా ఫీజులు చెల్లించలేని దుస్థితి నెలకొందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సంఘాల ఐకాస రాష్ట్ర నాయకులు డాక్టర్ కుమార్ నాయక్, బాలాజీ చౌహాన్ మాట్లాడుతూ.. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.1187, 1190, 1195లను వెంటనే అమలు చేయాలని కోరారు. జీవోల అమలుతో రాష్ట్రంలోని సుమారు 4,500 మంది ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు నాలుగున్నర సంవత్సరాల 30 శాతం పీఆర్‌సీ బకాయిలు అందడంతో పాటు, ఇప్పటివరకు పీఆర్‌సీ ప్రయోజనం పొందని ఉద్యోగులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. కోర్టు ఆదేశాలున్నప్పటికీ జీవోలు అమలు కాకపోవడంతో ధిక్కార పిటిషన్లు దాఖలు చేసినట్లు వివరించారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఫిజియోథెరపిస్టుల యూనియన్ అధ్యక్షుడు డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ.. ప్రతి జిల్లా ఆసుపత్రిలో ప్రత్యేక ఫిజియోథెరపీ విభాగాలను ఏర్పాటు చేసి, ఖాళీగా ఉన్న ఫిజియోథెరపిస్టు పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. జాతీయ అలైడ్ అండ్ హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్ చట్టం–2021 ప్రకారం తెలంగాణలో స్టేట్ అలైడ్ అండ్ హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసి, ఛైర్మన్‌ను నియమించాలని డిమాండ్ చేశారు.
వినతులను సానుకూలంగా పరిశీలించిన హుస్సేన్ నాయక్.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫిజియోథెరపీ విభాగాల ఏర్పాటు ఎంతో అవసరమని పేర్కొన్నారు. సంబంధిత అధికారులతో సమస్యలపై చర్చించి ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.