CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 24 July 2026, 10:56 am Posted by : rakeshkashaveni12@gmail.com

మహిళా సంఘాల వివాదాలను వెంటనే పరిష్కరించాలి

– ఉన్నతాధికారులకు సముద్రాల ఉపసర్పంచ్ చింతకింది సింగరయ్య విజ్ఞప్తి
హుస్నాబాద్, జూలై 24 (చైతన్యగళం):
కోహెడ మడలం సముద్రాల గ్రామంలో మహిళా సంఘాలకు సంబంధించిన వివాదాలను ఉన్నతాధికారులు వెంటనే పరిష్కరించాలని గ్రామ ఉపసర్పంచ్ చింతకింది సింగరయ్య కోరారు. గ్రామంలో మహిళా సంఘాల నిర్వహణలో నెలకొన్న సమస్యల కారణంగా సభ్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీనిపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఇటీవల తేజ వీఓఏ పై అవినీతి ఆరోపణలు మీడియాలో ప్రచురితమైనప్పటికీ, సంబంధిత శాఖ అధికారులు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక వివరణ ఇవ్వలేదని ఆయన అన్నారు. ఆ ఆరోపణలపై పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించి, ఆరోపణలు నిజమని తేలితే సంబంధిత వీఓఏ ను సస్పెండ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆరోపణలు అసత్యమైతే ప్రజలకు స్పష్టమైన వివరణ ఇవ్వాలని కూడా కోరారు.

గ్రామంలో సక్రమంగా పనిచేయని మహిళా సంఘాలను గుర్తించి వాటిని పునర్వ్యవస్థీకరించాలని సూచించారు. సముద్రాల గ్రామంలో సుమారు 80 మహిళా సంఘాలు ఉన్నాయని, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొన్ని సంఘాలను విలీనం చేసి మూడో వీవోను ఏర్పాటు చేస్తే పరిపాలన మరింత సమర్థవంతంగా సాగుతుందని అభిప్రాయపడ్డారు.

అలాగే కొత్తగా మూడో వీఓఏ. ను ఏర్పాటు చేసినట్లయితే, విఓఏ. ఎంపికను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలని కోరారు. ఎలాంటి సిఫార్సులు, పక్షపాతానికి తావులేకుండా అర్హత పరీక్ష నిర్వహించి ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తే మహిళా సంఘాల సభ్యులకు న్యాయం జరుగుతుందని తెలిపారు.

మహిళా సంఘాల మధ్య కొనసాగుతున్న విభేదాలు గ్రామాభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని, ఈ సమస్యను ఇకపై నిర్లక్ష్యం చేయకుండా జిల్లా, మండల స్థాయి అధికారులు ప్రత్యేక దృష్టి సారించి శాశ్వత పరిష్కారం చూపాలని సింగరయ్య విజ్ఞప్తి చేశారు. మహిళా సంఘాలపై మహిళల్లో విశ్వాసం పెరిగేలా, పారదర్శకమైన వ్యవస్థను ఏర్పాటు చేసి గ్రామంలో సమన్వయంతో కార్యకలాపాలు కొనసాగేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.