హుస్నాబాద్, జూలై 23 (చైతన్య గళం):
ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లతో హుస్నాబాద్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు.
గ్రామీణ ప్రాంతాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రజలకు చేరవేయాలని మంత్రి సూచించారు. శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం వచ్చే జూన్ వరకు వర్షాభావ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉన్నందున తాగునీటి సమస్యను దృష్టిలో ఉంచుకుని ముందస్తు కార్యాచరణ చేపట్టాలని అన్నారు.
కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని, ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ సాగుపై అవగాహన కల్పించాలని సూచించారు. పశువులకు పశుగ్రాసం కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
భూగర్భ జలాల మట్టం రోజురోజుకు తగ్గిపోతున్న నేపథ్యంలో ప్రత్యేక యాక్షన్ ప్లాన్ అమలు చేసి, ఇంకుడు గుంతల నిర్మాణం వంటి చర్యల ద్వారా పడిన ప్రతి వర్షపు నీటి చుక్కను సంరక్షించాలని మంత్రి పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, గ్రామీణ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ సమావేశంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె. హైమావతి, కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బజ్‌పేయి, అదనపు కలెక్టర్లు, మూడు జిల్లాల వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.