CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 22 July 2026, 10:55 am Posted by : rakeshkashaveni12@gmail.com

ఓటరు జాబితా ప్రత్యేక సవరణను వేగవంతం చేయాలి – రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి

సిద్దిపేట, జూలై 21 (చైతన్యగళం):
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను వేగవంతం చేసి భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు.

మంగళవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర ఎన్నికల అధికారి కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రత్యేక ఓటరు జాబితా సవరణ పురోగతిని సమీక్షించారు.

ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని, అనర్హుల పేర్ల తొలగింపు, ఓటరు వివరాల సవరణను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించి, ప్రజలకు అవగాహన కల్పిస్తూ దరఖాస్తులను స్వీకరించి వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. అందిన దరఖాస్తులను ఎలాంటి జాప్యం లేకుండా పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని తెలిపారు.

కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె. హైమావతి మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్‌ను అధికారుల సమన్వయంతో వేగవంతం చేసి గడువులోగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టామని చెప్పారు. బూత్ స్థాయి అధికారులు, బూత్ స్థాయి ఏజెంట్ల సమన్వయంతో ప్రక్రియను మరింత వేగవంతం చేస్తామని తెలిపారు.