- వృద్ధ దంపతులను బంధించి బంగారం, నగదు దోచుకెళ్లిన ఎనిమిది మంది దుండగులు
- 66 తులాల బంగారం, రూ.21 లక్షల నగదు అపహరణ.. ప్రత్యేక బృందాలతో గాలిస్తున్న పోలీసులు
కరీంనగర్, జూలై 22 (చైతన్య గళం): కరీంనగర్ నగరంలోని భగత్‌నగర్‌లో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకున్న భారీ దోపిడీ ఘటన తీవ్ర కలకలం రేపింది. పక్కా ప్రణాళికతో వచ్చిన ఎనిమిది మంది గుర్తుతెలియని దుండగులు ఓ ఇంటిలోకి చొరబడి వృద్ధ దంపతులు హజ్మత్ అలీ, మెహబూబా బేగం దంపతులతో పాటు కుటుంబ సభ్యులను తాడులతో కట్టేసి, నోటిలో గుడ్డలు కుక్కి డమ్మీ తుపాకులు, కత్తులతో బెదిరించారు. సుమారు గంటన్నరపాటు ఇంట్లో బీభత్సం సృష్టిస్తూ బీరువాలు, అల్మారాలను పూర్తిగా గాలించారు.
దుండగులు ఇంట్లో ఉన్న 66 తులాల బంగారం, 10 తులాల వెండి, రూ.21 లక్షల నగదుతో పాటు బాధితుల మెడల్లోని బంగారు గొలుసులు, చేతి ఉంగరాలను కూడా అపహరించారు. అనంతరం ఇంటి పార్కింగ్‌లో ఉన్న రెండు ద్విచక్ర వాహనాలను తీసుకుని పరారయ్యారు. కుటుంబ సభ్యులు బంధనాల నుంచి బయటపడిన తర్వాత స్థానికుల సహాయంతో పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ సిబ్బందితో ఆధారాలు సేకరించారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తూ, ఘటనలో పాల్గొన్న దుండగుల కదలికలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో విస్తృత గాలింపు చేపట్టారు. నగర శివార్లు, ప్రధాన రహదారులు, టోల్‌ప్లాజాల వద్ద కూడా అప్రమత్త చర్యలు చేపట్టినట్లు సమాచారం.
ఘటన విషయం తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్ నాంపల్లి శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి శ్రీనివాస్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నగర పోలీస్ కమిషనర్ గౌస్ అలంతో ఫోన్‌లో మాట్లాడి, దుండగులను త్వరితగతిన అరెస్టు చేసి ప్రజల్లో పోలీసు వ్యవస్థపై విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రజల్లో భయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో రాత్రి వేళల్లో పోలీసు గస్తీని మరింత పెంచాలని, సీసీటీవీ నిఘాను బలోపేతం చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఇటీవలి కాలంలో నగరంలో వరుసగా చోటుచేసుకుంటున్న ఆస్తి నేరాల నేపథ్యంలో ఈ ఘటన పోలీసులకు సవాలుగా మారింది.