CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 22 July 2026, 10:54 am Posted by : rakeshkashaveni12@gmail.com

మహిళలకు ఆర్థిక అక్షరాస్యత– సైబర్ భద్రతపై అవగాహన

సిద్ధిపేట, జూలై 21 (చైతన్యగళం):
స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించడంతో పాటు డిజిటల్ లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచించారు. లీడ్ బ్యాంక్ కార్యాలయం ఆధ్వర్యంలో సిద్ధిపేటలోని ఆర్‌సేటీ (RSETI)లో నిర్వహించిన ఆర్థిక అక్షరాస్యత అవగాహన కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 85 మంది స్వయం సహాయక సంఘాల మహిళా గ్రూపు లీడర్లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆర్‌బీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ చేతన్ గోరేకర్ మాట్లాడుతూ ప్రతి కుటుంబంలో పొదుపు అలవాటు పెంపొందించాలని, బ్యాంకుల ద్వారా అందుబాటులో ఉన్న పొదుపు పథకాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు, డిజిటల్ బ్యాంకింగ్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.

సైబర్ క్రైమ్ డీఎస్పీ పి. రాజు మాట్లాడుతూ ఓటీపీ, సీవీవీ, ఏటీఎం పిన్, బ్యాంకు పాస్‌వర్డ్ వంటి గోప్య వివరాలను ఎవరికీ వెల్లడించరాదని, అనుమానాస్పద లింకులు, ఫోన్ కాల్స్, సందేశాలకు స్పందించకుండా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు లేదా సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.

నాబార్డ్ జిల్లా అభివృద్ధి మేనేజర్ నిఖిల్ రెడ్డి సామాజిక భద్రతా పథకాల ప్రాధాన్యతను వివరించగా, డీఆర్‌డీఏ ఏపీడీ సుధీర్ స్వయం సహాయక సంఘాల నిర్వహణలో పాటించాల్సిన పంచసూత్రాలపై అవగాహన కల్పించారు. ఎల్‌డీఎం ప్రభుత్వ సంక్షేమ పథకాలు, బ్యాంకు రుణాలు, డిజిటల్ బ్యాంకింగ్ సేవలపై వివరించారు.

ఆర్‌సేటీ డైరెక్టర్ గెమునాయక్ మాట్లాడుతూ సంస్థ ద్వారా ఉచితంగా అందిస్తున్న 64 రకాల స్వయం ఉపాధి శిక్షణలను మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో మహిళలు ఆర్థిక అక్షరాస్యత, పొదుపు, సైబర్ భద్రత, స్వయం ఉపాధి అవకాశాలపై విలువైన అవగాహన పొందారు.