మహబూబాబాద్, జూలై 22(చైతన్యగళం): పర్యావరణ పరిరక్షణ సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా సైన్స్ అధికారి, గణిత శిక్షణ కోర్సు ఇన్‌చార్జి అప్పారావు అన్నారు. మహబూబాబాద్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న మూడు రోజుల గణిత శిక్షణ కార్యక్రమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు.
శిక్షణలో రిసోర్స్ పర్సన్ రాయిపెల్లి యాకయ్య మాట్లాడుతూ ప్లాస్టిక్ ప్లేట్ల వినియోగాన్ని నివారించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఉపాధ్యాయులను కోరారు. దీనికి స్పందించిన జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన గణిత ఉపాధ్యాయులు తమ ఇళ్ల నుంచి స్టీల్ ప్లేట్లు తీసుకువచ్చి వాటిలో భోజనం చేసి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందించారు.
ఈ సందర్భంగా అప్పారావు, జిల్లా రిసోర్స్ పర్సన్ యాకయ్య మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ భూమిలో కలిసిపోవడానికి వందల సంవత్సరాలు పడుతుందని, అందువల్ల ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడంతో పాటు ఇతరులను కూడా ప్లాస్టిక్ వినియోగానికి దూరంగా ఉండేలా చైతన్యపరచాలని కోరారు. పర్యావరణ పరిరక్షణకు ఆదర్శంగా నిలిచిన ఉపాధ్యాయులను వారు అభినందించి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్స్ వేదప్రకాష్, సుమన్, జుమ్మిలాల్‌తో పాటు ఉపాధ్యాయులు మాధవచారి, చంద్రశేఖర్, లింగమూర్తి, శ్రీనివాసులు, లింగరాజు, శ్రీనివాస్‌రెడ్డి, రామనాధం, కిషన్, భీముడు, కృష్ణారెడ్డి, అంజయ్య, శ్రీను, వెంకటేశ్వర్లు, కల్యాణి, మంజుల, శ్రావణి, షెహనాభేగం, సరోజన తదితరులు పాల్గొన్నారు.