CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 22 July 2026, 10:56 am Posted by : rakeshkashaveni12@gmail.com

కస్తూర్బా పాఠశాలలో రాత్రి భోజనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

సిద్దిపేట, జూలై 21 (చైతన్యగళం):
తొగుట మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కె. హైమావతి మంగళవారం సాయంత్రం ఆకస్మికంగా సందర్శించి విద్యార్థినులకు అందిస్తున్న రాత్రి భోజనం, వసతులను పరిశీలించారు.

ఈ సందర్భంగా అన్నం, వంకాయ–టమాట పచ్చడి, సాంబారు, పెరుగుతో కూడిన భోజనాన్ని పరిశీలించిన కలెక్టర్, కామన్ డైట్ మెనూను తప్పనిసరిగా పాటిస్తూ నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలని వంట సిబ్బందికి సూచించారు. స్టాక్ రిజిస్టర్‌ను తనిఖీ చేసి, విద్యార్థుల హాజరుకు అనుగుణంగా సరుకులను కొలతల ప్రకారం పంపిణీ చేసి, నాణ్యతతో వంటలు తయారు చేయాలని ఆదేశించారు.

అనంతరం విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్, సమస్యలపై ఆరా తీశారు. రాత్రివేళ పాఠశాల మైదానం, రహదారి వద్ద తగినంత వెలుతురు లేకపోవడం, దారి గుంతలు, బురదతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని విద్యార్థినులు వివరించారు. దీనిపై వెంటనే స్పందించిన కలెక్టర్ మైదానం, పాఠశాలకు వెళ్లే దారి వెంబడి స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయాలని జిల్లా పంచాయతీ అధికారిని ఫోన్‌లో ఆదేశించారు. రహదారి సమస్యను కూడా త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని సమయాన్ని వృథా చేయకుండా కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, తరచూ పాఠశాలను పర్యవేక్షించాలని స్థానిక ఎస్‌ఐకి ఆదేశించారు.