CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 21 July 2026, 5:09 pm Posted by : CHAITHANYA GALAM NEWS

యువత గొంతును అణచలేరు

  • ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోరాటం కొనసాగుతుందన్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

న్యూఢిల్లీ, జూలై 21 (చైతన్యగళం‌):
దేశ యువత తమ హక్కుల కోసం ప్రశాంతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే వారిపై బలప్రయోగం జరగడం అత్యంత దురదృష్టకరమని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ తీవ్రంగా విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల స్వరాన్ని అణచివేయాలని చేసే ప్రతి ప్రయత్నాన్ని ప్రజలు గమనిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.

ఇటీవల ఢిల్లీలో జరిగిన పరిణామాలపై స్పందించిన ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ, “విద్యార్థులు, యువత తమ సమస్యలను శాంతియుతంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తే వారిపై లాఠీచార్జ్, టియర్ గ్యాస్ వంటి చర్యలు చేపట్టడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం” అని అన్నారు.

దేశ యువతను భయపెట్టి వారి గొంతును అణచివేయడం సాధ్యం కాదని, ఉద్యోగాలు, విద్య, భవిష్యత్తు కోసం పోరాడుతున్న యువతకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ప్రజాస్వామ్య హక్కులను కాపాడేందుకు పోరాటం నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

కేంద్ర ప్రభుత్వం యువత ఆవేదనను అర్థం చేసుకుని వారి సమస్యలకు పరిష్కారాలు చూపాల్సిందిపోయి, నిరసనలను అణచివేసే విధానాన్ని అవలంబించడం బాధాకరమని ఎంపీ వంశీకృష్ణ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో విభిన్న అభిప్రాయాలను గౌరవించడం ప్రభుత్వ బాధ్యత అని, దేశ యువత భవిష్యత్తు కోసం తమ గళాన్ని వినిపిస్తూనే ఉంటారని ఆయన అన్నారు.