CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 21 July 2026, 5:07 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ప్రశ్నిస్తే లాఠీచార్జీనా? విద్యార్థుల గొంతు నొక్కేయాలనుకుంటున్నారా?

  • ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జీని ఖండిస్తూ అచ్చంపేటలో ఐఏఎస్ ఎఫ్ నిరసన సమావేశం.

అచ్చంపేట, జూలై 21(చైతన్యగళం):

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థి, యువజన సంఘాలపై పోలీసులు జరిపిన లాఠీచార్జీని తీవ్రంగా ఖండిస్తూ, ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ నాగర్‌కర్నూల్ జిల్లా సమితి ఆధ్వర్యంలో అచ్చంపేట నియోజకవర్గ కేంద్రంలోని ఏఐఎస్ఎఫ్ కార్యాలయంలో మంగళవారం నిరసన సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏఐఎస్ఎఫ్ నాగర్‌కర్నూల్ జిల్లా కార్యదర్శి బలుముల ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ, ప్రశ్నించే విద్యార్థులపై ప్రభుత్వం పోలీసు బలగాలను ప్రయోగించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లకు సమాధానం చెప్పాల్సిన కేంద్ర ప్రభుత్వం, లాఠీచార్జీలతో ఉద్యమాలను అణచివేయాలని ప్రయత్నించడం అత్యంత దురదృష్టకరమని విమర్శించారు.
దేశంలో 2014 నుండి ఇప్పటి వరకు సుమారు 152 పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని పేర్కొంటూ, వరుస పేపర్ లీకేజీలు దేశ విద్యా వ్యవస్థపై విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు లక్షల రూపాయలు ఖర్చు చేసి కోచింగ్ తీసుకుని, ఎన్నో ఆశలతో పరీక్షలకు హాజరవుతుంటే, ప్రశ్నాపత్రాల లీకేజీల కారణంగా వారి భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యంగా 2026 నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడిన ఘటనగా పేర్కొంటూ, పరీక్షల పారదర్శకతను కాపాడడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఈ వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఈ డిమాండ్లతో విద్యార్థి, యువజన సంఘాలు ఢిల్లీలోని జంతర్ మంతర్ నుండి పార్లమెంట్ వైపు శాంతియుతంగా చేపట్టిన నిరసన ప్రదర్శనను పోలీసులు అడ్డుకొని లాఠీచార్జీ చేయడం, పలువురు విద్యార్థి నాయకులను గాయపరచడం, అరెస్టులు చేయడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని అన్నారు. ప్రశ్నించే ప్రతి గొంతును బలవంతంగా అణచివేయాలని ప్రయత్నించడం దేశ భవిష్యత్తుకు ప్రమాదకర సంకేతమని హెచ్చరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “గాయాలు శరీరానికే… సంకల్పానికి కాదు. లాఠీలతో ఉద్యమాలను ఆపలేరు. విద్య హక్కు కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం ఏఐఎస్ఎఫ్ పోరాటం నిరంతరం కొనసాగుతుంది” అని స్పష్టం చేశారు.

సమావేశంలో నాయకులు మాట్లాడుతూ, ప్రశ్నలకు సమాధానం లాఠీచార్జీ కాదని, పేపర్ లీకేజీలపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, పరీక్షల నిర్వహణలో పూర్తి పారదర్శకత పాటించాలని, విద్యార్థులకు న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాగర్‌కర్నూల్ జిల్లా సమితి సభ్యులు మధు, ఫన్నీ, అర్జున్, చరణ్, సన్నీ తదితరులు పాల్గొన్నారు.