CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 20 July 2026, 10:55 pm Posted by : CHAITHANYA GALAM NEWS

అక్రమ వడ్డీ వ్యాపారులు, లైసెన్స్ లేని చిట్టీల నిర్వాహకులపై పోలీసుల ప్రత్యేక దాడులు

మహబూబాబాద్, జూలై 20 (చైతన్యగళం):
జిల్లాలో అక్రమ వడ్డీ వ్యాపారులు, లైసెన్స్ లేకుండా చిట్టీలు నిర్వహిస్తున్న నిర్వాహకులపై మహబూబాబాద్ జిల్లా పోలీసులు సోమవారం ప్రత్యేక దాడులు చేపట్టారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సబ్‌డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో సీఐలు, ఎస్‌ఐల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు సోదాలు నిర్వహించాయి.

అధిక వడ్డీలకు అప్పులు ఇస్తూ రుణగ్రహీతల నుంచి షూరిటీల పేరుతో ఖాళీ చెక్కులు, భూముల అసలు పత్రాలు, ఇతర విలువైన డాక్యుమెంట్లు అక్రమంగా స్వాధీనం చేసుకోవడం, ఎలాంటి అనుమతులు లేకుండా చిట్టీలు నిర్వహిస్తూ ప్రజలను ఆర్థికంగా వేధిస్తున్న వ్యక్తులను గుర్తించి తనిఖీలు చేపట్టారు.

జిల్లా వ్యాప్తంగా 90 ప్రాంతాల్లో సోదాలు జరిపి, 10 మంది నిందితులపై కేసులు నమోదు చేశారు. వారి వద్ద నుంచి రూ.3.59 కోట్ల విలువైన 266 ఆస్తి పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అక్రమ వడ్డీ వ్యాపారం, లైసెన్స్ లేని చిట్టీల నిర్వహణ, ప్రజలను బెదిరించి ఖాళీ చెక్కులు, ఆస్తి పత్రాలు తీసుకోవడం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా డీఎస్పీ ఎన్. తిరుపతి రావు స్పష్టం చేశారు.

ఇలాంటి అక్రమ వడ్డీ వ్యాపారులు లేదా లైసెన్స్ లేని చిట్టీల నిర్వాహకుల వల్ల ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లేదా జిల్లా పోలీసు అధికారులను సంప్రదించి ఫిర్యాదు చేయాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.