మహబూబాబాద్, జూలై 20 (చైతన్యగళం):
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించేందుకు విస్తృతంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని రోటరీ క్లబ్ ఆఫ్ మహబూబాబాద్ అధ్యక్షుడు దూదికట్ల సత్యం అన్నారు.
ప్రపంచ పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా ఆదివారం మహబూబాబాద్ మోడల్ స్కూల్ ప్రాంగణంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వందకు పైగా మొక్కలు నాటారు.
అధ్యక్షుడు సత్యం మాట్లాడుతూ, “అడవుల నరికివేత, పెరుగుతున్న కాలుష్యం కారణంగా వాతావరణంలో తీవ్ర మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వర్షాభావం, తీవ్ర ఉష్ణోగ్రతలు, కరువు, ఆకస్మిక వరదలు మానవాళికి హెచ్చరికగా నిలుస్తున్నాయి. పర్యావరణ సమతుల్యతను కాపాడాలంటే మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించడం కూడా ప్రతి ఒక్కరి బాధ్యత” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రధాన కార్యదర్శి శంతన్ రామరాజు, కోశాధికారి ముల్లంగి మోహన్ రెడ్డి, డిస్ట్రిక్ట్ లీడర్ బిక్కి వెంకటేశ్వర్లు, సీనియర్ రొటేరియన్లు బొల్లం శ్రీనివాస్, బోనగిరి గిరిధర్ గుప్తా, సాధు మహిపాల్ రెడ్డి, అచ్చ శ్రీనివాస్, జిల్లా పదో తరగతి పరీక్షల అధికారి మందుల శ్రీరాములు, మోడల్ స్కూల్ ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు, ఉపాధ్యాయిని కీర్తన, విద్యార్థులు పాల్గొన్నారు.