CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 20 July 2026, 10:23 pm Posted by : CHAITHANYA GALAM NEWS

సరస్వతి శిశు మందిర్‌లో కంప్యూటర్లు, సంగీత వాయిద్యాల ప్రారంభోత్సవం

సిరిసిల్ల, జూలై 20 (చైతన్యగళం‌):
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల గాంధీనగర్లో సోమవారం ఉదయం దాతలు అందించిన కంప్యూటర్లు, తబలా, మృదంగం, హార్మోనియం వంటి సంగీత వాయిద్యాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. విద్యార్థులు ఆధునిక సాంకేతిక విద్యతో పాటు భారతీయ సంగీతాన్ని అభ్యసించేందుకు వీలుగా ఈ పరికరాలను పాఠశాల యాజమాన్యం అధికారికంగా ప్రారంభించింది.

ఈ సందర్భంగా తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జిల్లా శాఖ అధ్యక్షుడు చేపూరు బుచ్చయ్య మాట్లాడుతూ విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి కంప్యూటర్ విద్యతో పాటు సంగీతం, కళలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. చిన్నారులు భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు వారసులుగా ఎదగాలంటే సంగీతం, సాహిత్యం, కళల పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలని సూచించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ జనపాల శంకరయ్య మాట్లాడుతూ సంగీతం మనిషిలో క్రమశిక్షణ, ఏకాగ్రత, సృజనాత్మకతను పెంపొందిస్తుందని, విద్యార్థులు విద్యతో పాటు సాంస్కృతిక రంగాల్లోనూ రాణించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు ఏనుగుల ఎల్లయ్య, సహాయ కార్యదర్శి గౌరిశెట్టి ఆనందం, కార్యనిర్వాహక కార్యదర్శులు గుడ్ల శ్రీధర్, గజ్జల్లి రామచంద్రం, కోశాధికారి దొంత దేవదాసు, అలాగే పాఠశాల కోశాధికారి రాపెళ్లి ముకుందం తదితరులు పాల్గొన్నారు. అతిథులు దాతల సేవాభావాన్ని అభినందిస్తూ విద్యార్థులు ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని విద్య, సాంకేతిక పరిజ్ఞానం, సంగీత రంగాల్లో ప్రతిభ చాటాలని ఆకాంక్షించారు.

చివరగా అసోసియేషన్ ప్రతినిధులు తమను ఆహ్వానించి గౌరవించిన పాఠశాల యాజమాన్యానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో విద్యతో పాటు సంస్కారం, సృజనాత్మకత, భారతీయ విలువల పట్ల ఆసక్తిని పెంపొందించే దిశగా ఒక మంచి ముందడుగుగా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు.