CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 20 July 2026, 10:28 pm Posted by : CHAITHANYA GALAM NEWS

తోపుడు బండిపై వినూత్న ప్రచారం

  • ఓటరు నమోదుకు ప్రజలను చైతన్యపరిచిన సీపీఐ కౌన్సిలర్ బి. అజయ్ సారధి రెడ్డి

మహబూబాబాద్, జూలై 20 ‌(చైతన్యగళం): ఓటరు నమోదులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిస్తూ మహబూబాబాద్ మున్సిపాలిటీ 33వ వార్డు కౌన్సిలర్, సీపీఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి. అజయ్ సారధి రెడ్డి సోమవారం పట్టణంలో వినూత్న ప్రచారం నిర్వహించారు.

తోపుడు బండిపై ఓటరు నమోదు దరఖాస్తు ఫారాలను ఉంచి, మైక్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఇంటింటికీ వెళ్లి ఓటు నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. “ఆగస్టు 3వ తేదీ వరకు ఓటరు నమోదు అవకాశం ఉంది. అర్హులైన ప్రతి ఒక్కరూ తమ పరిధిలోని బీఎల్‌వోలను సంప్రదించి ఓటు నమోదు చేసుకోవాలి” అని సూచించారు.

ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైన హక్కు అని, పాలనలో మార్పు తీసుకురావాలంటే ప్రతి పౌరుడు తన ఓటు హక్కును నమోదు చేసుకుని ఎన్నికల్లో వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. వృద్ధులు, కొత్త ఓటర్ల వద్దకు స్వయంగా వెళ్లి దరఖాస్తు ఫారాలు నింపించి ఓటరు నమోదుపై అవగాహన కల్పించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీఎల్‌వో సరస్వతి, పెరుగు కుమార్, నీలం వెంకటేశ్వర్లు, యూసుఫ్, సాయి, మేక వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.