CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 18 July 2026, 10:14 pm Posted by : CHAITHANYA GALAM NEWS

విద్యార్థుల్లో చట్టాలపై అవగాహన పెంపే లక్ష్యం

  • మహబూబాబాద్‌లో స్టూడెంట్ లీగల్ లిటరసీ క్లబ్‌ల ప్రారంభం

మహబూబాబాద్, జూలై 18(చైతన్యగళం): విద్యార్థి దశ నుంచే షెడ్యూల్ తెగలకు చెందిన బాలబాలికల్లో చట్టాలపై అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం రెండు స్టూడెంట్ లీగల్ లిటరసీ క్లబ్‌లను ప్రారంభించారు.

జాతీయ న్యాయ సేవాధికార సంస్థ రూపొందించిన “సంవాద్” పథకం మార్గదర్శకాల మేరకు బయ్యారం ఏకలవ్య గురుకుల పాఠశాల, మహబూబాబాద్ గిరిజన బాలికల పాఠశాలలో ఈ క్లబ్‌లను ఏర్పాటు చేశారు. 9వ, 11వ తరగతులు చదువుతున్న మొత్తం 40 మంది విద్యార్థులను సభ్యులుగా చేర్చారు. ప్రతి పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు క్లబ్ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తారు.

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్యానెల్ న్యాయవాదులు ప్రతి నెల ఒకసారి పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు రాజ్యాంగం, బాలల హక్కులు, మహిళల రక్షణ, సైబర్ నేరాలు, ఇతర ముఖ్యమైన చట్టాలపై అవగాహన కల్పిస్తారు. విద్యార్థులు పాఠశాల విద్య పూర్తయ్యే నాటికి చట్టాలపై సమగ్ర అవగాహనతో పాటు తమ హక్కులు, బాధ్యతలను తెలుసుకునేలా చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.

విద్యార్థుల్లో న్యాయ విజ్ఞానంపై ఆసక్తి పెంపొందించేందుకు క్లబ్‌ల మధ్య క్విజ్, వ్యాసరచన తదితర పోటీలను కూడా నిర్వహించనున్నారు. ప్యానెల్ న్యాయవాదులు బి. దేవి, జి. సునీత, కమల్ కుమార్ విద్యార్థులకు న్యాయ అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నారు.