CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 18 July 2026, 10:24 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ఆర్‌సీఓ రత్నకుమారిని వెంటనే విధుల నుంచి తొలగించాలి

  • డీఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా ఆర్‌సీఓ కార్యాలయం ఎదుట భారీ ధర్నా

మహబూబాబాద్(చైతన్యగళం): గిరిజన విద్యార్థుల మనోభావాలను దెబ్బతీసిన మహబూబాబాద్ జిల్లా ఆర్‌సీఓ రత్నకుమారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకొని విధుల నుంచి తొలగించాలని డీఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి కెలోత్ సాయికుమార్, రాష్ట్ర కోశాధికారి గూగులోతు సూర్యప్రకాశ్ డిమాండ్ చేశారు. శనివారం డీఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా ఆర్‌సీఓ కార్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నిరసన కారులు చెప్పులతో వినూత్నంగా ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ… పలుమార్లు వివిధ గురుకుల విద్యాసంస్థల్లో విద్యార్థులు ఆందోళనలు చేసినప్పటికీ ఆర్‌సీఓ రత్నకుమారిపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విచారకరమని విమర్శించారు. డీసీఓపై చర్యలు తీసుకునే ప్రభుత్వం, ఆర్‌సీఓ విషయంలో మాత్రం ఎందుకు నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ప్రశ్నించారు.

విద్యార్థులు ధర్నా చేపట్టనున్న విషయం ముందుగానే తెలిసినా, ఆర్‌సీఓ రత్నకుమారి విధులకు హాజరుకాకుండా సెలవు పెట్టడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని ఆరోపించారు. ఆమెను కాపాడే ప్రయత్నంలో జిల్లా పరిపాలన అధికారులు ఉన్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు.

గిరిజన విద్యార్థుల మనోభావాలను దెబ్బతీసిన అధికారిపై తక్షణమే చర్యలు తీసుకొని విధుల నుంచి తొలగించాలని, లేనిపక్షంలో డీఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో డీఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలు చేశారు.