CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 18 July 2026, 5:04 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ఎంఎస్ అగర్వాల్ ఫౌండ్రీస్ విస్తరణపై న్యాయ విద్యార్థి చెలిమెల మణివర్ధన్ అభ్యంతరం

మనోహరాబాద్, జూలై 18 (చైతన్యగళం):
మెదక్ జిల్లా చెట్లగౌరారం, రంగాయిపల్లి గ్రామాల పరిసరాల్లో ఉన్న ఎంఎస్ అగర్వాల్ ఫౌండ్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఉత్పత్తి సామర్థ్యాన్ని 10.70 లక్షల టన్నులకు (TPA) విస్తరించేందుకు చేసిన దరఖాస్తును తిరస్కరించాలని న్యాయ విద్యార్థి చెలిమెల మణివర్ధన్ శనివారం సంగారెడ్డి ప్రాంతీయ కాలుష్య నియంత్రణ మండలికి లిఖితపూర్వక అభ్యంతర పత్రం సమర్పించారు.

2019లో సంస్థ 6 లక్షల టన్నుల విస్తరణ కోసం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో స్థానికులు గాలి, నీరు, శబ్ద కాలుష్యం, ప్రజారోగ్యం, వ్యవసాయంపై ప్రతికూల ప్రభావాలపై ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ, అనంతరం అనుమతులు మంజూరయ్యాయని ఆయన గుర్తుచేశారు.

ప్రస్తుతం మరోసారి విస్తరణకు దరఖాస్తు చేసిన నేపథ్యంలో ఇటీవల జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో కూడా గ్రామస్థులు విస్తరణను వ్యతిరేకిస్తూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారని మణివర్ధన్ తెలిపారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య జరిగిన సమావేశంలో ప్రజలు పర్యావరణం, భూగర్భ జలాలు, వ్యవసాయం, ప్రజారోగ్యంపై పడే ప్రభావాలపై తమ అభ్యంతరాలను స్పష్టంగా వెల్లడించారని ఆయన పేర్కొన్నారు.

“స్థానిక ప్రజల అభిప్రాయాలను గౌరవించి, పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్యం, భూగర్భ జలాల సంరక్షణ, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ విస్తరణ ప్రతిపాదనను తిరస్కరించాలి” అని మణివర్ధన్ కాలుష్య నియంత్రణ మండలిని కోరారు.