CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 18 July 2026, 10:22 pm Posted by : CHAITHANYA GALAM NEWS

అమరుల యాదిలో గీతన్నల చైతన్య యాత్ర

వర్ధన్నపేట,జూలై 18(చైతన్యగళం): గీత కార్మికుల సమస్యల పరిష్కారం, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు కోసం “అమరుల యాదిలో గీతన్నల చైతన్య యాత్ర” నిర్వహించనున్నట్లు కల్లు గీత కార్మిక సంఘం నాయకులు ప్రకటించారు. ఈ చైతన్య యాత్ర ఆగస్టు 2 నుంచి 18 వరకు మానుకోట నుంచి హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వరకు కొనసాగనున్నట్లు తెలిపారు.శనివారం వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలోని తాటి వనంలో అమరుల యాదిలో గీతన్నల చైతన్య యాత్ర కు సంబంధించిన వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని కల్లుగీతా కార్మిక సంఘం వర్ధన్నపేట మండల అధ్యక్షులు జనగాం యాకయ్య గౌడ్, జిల్లా సలహాదారులు సట్ల సూరయ్య గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా గౌరవ అధ్యక్షులు పులి సోమయ్య గౌడ్, జిల్లా అధ్యక్షులు తాళ్లపెల్లి నర్సయ్య గౌడ్, జిల్లా సహాయ కార్యదర్శి బాలగోయిన రాంబాబు గౌడ్,జిల్లా సలహాదారులు సట్ల సూరయ్య గౌడ్ హాజరై కల్లుగీతా కార్మిక సంఘం నాయకులతో కలిసి అమరుల యాదిలో గీతన్నల చైతన్య యాత్ర వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్రంలోని గీత కార్మికులు ఎన్నో సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

వారు ప్రధానంగా చేసిన డిమాండ్లు ఇవి:

  • గీత కార్మికులకు నెలకు రూ.4,000 పెన్షన్ మంజూరు చేయాలి.
  • ప్రమాదాల్లో మృతి చెందిన గీత కార్మికుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా రూ.10 లక్షలకు పెంచాలి.
  • పెండింగ్‌లో ఉన్న రూ.20 కోట్ల ఎక్స్‌గ్రేషియా నిధులను వెంటనే బాధిత కుటుంబాలకు విడుదల చేయాలి.
  • ప్రతి గౌడ సహకార సంఘానికి 5 ఎకరాల భూమి కేటాయించాలి.
  • ఆగస్టు 18న సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై సర్వాయి పాపన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి.
  • సర్వాయిపేట, తాటికొండ, ఖిలాషాపురం తదితర చారిత్రక కోటలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలి.

గీత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం తక్షణమే సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. ఈ చైతన్య యాత్రలో పెద్ద సంఖ్యలో గీత కార్మికులు, గౌడ సంఘాల ప్రతినిధులు పాల్గొని ప్రభుత్వానికి తమ డిమాండ్లను వినిపించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ల్యాబర్తి గౌడ సంఘం అధ్యక్షులు బత్తిని రాజబాబు గౌడ్, రాయపర్తి మండల గౌరవాధ్యక్షులు తేరాల సదానందం గౌడ్, సంగెం మండల కార్యదర్శి మచ్చ గురువయ్య, వర్ధన్నపేట మండల కార్యకర్తలు సట్ల అనిల్,దొమ్మటి పృథ్వీరాజ్, కల్లుగీత కార్మిక సంగం నాయకులు తదితరులు పాల్గొన్నారు.