CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 18 July 2026, 2:45 pm Posted by : CHAITHANYA GALAM NEWS

తీవ్ర విషాదం.. చేపల వేటకు వెళ్లి ఐదుగురి మృతి

పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగూడెం వద్ద తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గోదావరిలో చేపల వేటకు వెళ్లి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

పోలవరం(చైతన్యగళం) : ఎటపాక మండలం గొల్లగూడెం వద్ద తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గోదావరిలో చేపల వేటకు వెళ్లి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతిచెందిన వారిని ఊకె సుశీల(37), ఊకె లక్ష్మి(37), తుర్రం భారతి(40), భాసుబోయిన బాలరాజు (38), ఊకె రమేశ్ (38)గా పోలీసులు గుర్తించారు. వారంతా గొమ్ము కొత్తగూడెం గ్రామ వాసులుగా వెల్లడించారు. బాధితులంతా చేపలు పట్టేందుకు గోదావరి నదిలోకి వెళ్లారు. అయితే, ప్రమాదవశాత్తూ వారంతా గల్లంతయ్యారు.

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. స్థానికుల సహాయంతో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి వారిని విగతజీవులుగా బయటకు తీశారు. ఈ ఘటనతో గొమ్ము కొత్తగూడెంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబాల సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.