మహబూబాబాద్,జూలై 18(చైతన్యగళం): తక్షణ రుణాల పేరుతో ప్రజలను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు నకిలీ లోన్ యాప్‌లు, వెబ్‌సైట్లు, వాట్సాప్ సందేశాల ద్వారా మోసాలకు పాల్పడుతున్నారని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తమ డబ్బు, వ్యక్తిగత సమాచారాన్ని సురక్షితంగా కాపాడుకోవాలని సూచించారు.
ఇటీవల పీఎం ముద్ర లోన్, ఇండియాబుల్స్ లోన్, హెల్త్ ఇన్సూరెన్స్ లోన్, స్టడీ సర్జరీ లోన్ వంటి పేర్లతో నకిలీ యాప్‌లు, వెబ్‌సైట్లు సృష్టించి, తక్కువ వడ్డీకి వెంటనే రుణం మంజూరు చేస్తామని నమ్మిస్తున్నారని తెలిపారు. బాధితులతో యాప్‌లు డౌన్‌లోడ్ చేయించి లేదా మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ద్వారా నమోదు చేయించి ఆధార్, పాన్, బ్యాంకు ఖాతా వివరాలు, ఫోటోలు వంటి వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారని చెప్పారు.
ఆ తర్వాత ప్రాసెసింగ్ ఫీజు, సెక్యూరిటీ డిపాజిట్, ఇన్సూరెన్స్ ఛార్జీలు, జీఎస్టీ, ఫైల్ ఛార్జీల పేరుతో డబ్బులు వసూలు చేసి, రుణం ఇవ్వకుండా మరిన్ని చెల్లింపులు చేయాలని ఒత్తిడి చేస్తున్నారని, కొన్నిసార్లు వాట్సాప్ కాల్స్, సందేశాల ద్వారా బెదిరింపులకు కూడా పాల్పడుతున్నారని పేర్కొన్నారు.
2026 సంవత్సరంలో ఇప్పటివరకు మహబూబాబాద్ జిల్లాలో నకిలీ లోన్ యాప్‌లకు సంబంధించి 95 ఫిర్యాదులు నమోదయ్యాయి. వీటి వల్ల బాధితులు మొత్తం రూ.14,59,337 మేర ఆర్థిక నష్టం చవిచూశారని తెలిపారు. జూన్-2026లో మాత్రమే 16 ఫిర్యాదులు నమోదై రూ.1,96,000 నష్టం జరిగినట్లు వెల్లడించారు.
పీఎం ముద్రా లోన్ కేంద్ర ప్రభుత్వ వ్యాపార రుణ పథకం మాత్రమేనని, ఈ రుణాల కోసం గుర్తింపు పొందిన బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (ఆర్‌ఆర్‌బీలు) లేదా అధికారిక ప్రభుత్వ పోర్టల్‌ల ద్వారానే దరఖాస్తు చేయాలని ఎస్పీ సూచించారు. అధికారిక విధానంలో ప్రాసెసింగ్ ఫీజు, సెక్యూరిటీ డిపాజిట్ లేదా ఇతర అడ్వాన్స్ చెల్లింపులను వ్యక్తిగత ఖాతాలు లేదా క్యూఆర్ కోడ్‌లకు చెల్లించాల్సిన అవసరం ఉండదని స్పష్టం చేశారు.
ప్రజలు సోషల్ మీడియా, వాట్సాప్, టెలిగ్రామ్, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా వచ్చే లోన్ ఆఫర్లను నమ్మవద్దని, తెలియని లింకులపై క్లిక్ చేయవద్దని, ఓటీపీ, ఏటీఎం పిన్, సీవీవీ, యూపీఐ పిన్, ఆధార్, పాన్, బ్యాంకింగ్ వివరాలను ఎవరికీ ఇవ్వవద్దని సూచించారు. బ్యాంక్ ఖాతాలు, ఇతర ఆన్‌లైన్ సేవలకు టూ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ (2ఎఫ్‌ఏ) వినియోగించాలని, బలమైన పాస్‌వర్డ్‌లు ఉపయోగించాలని, అనుమానాస్పద కార్యకలాపాలు గమనిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని కోరారు.
రుణాల కోసం కేవలం గుర్తింపు పొందిన బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థల ద్వారానే దరఖాస్తు చేయాలని, అధికారిక వెబ్‌సైట్ లేదా బ్యాంకు శాఖలో మాత్రమే దరఖాస్తు సమర్పించాలని ఎస్పీ సూచించారు.
సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్కు కాల్ చేయాలని లేదా అధికారిక సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని తెలిపారు. ఎంత త్వరగా ఫిర్యాదు చేస్తే పోయిన డబ్బు తిరిగి పొందే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయని ఎస్పీ డా. శబరీష్ పేర్కొన్నారు.