CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 18 July 2026, 10:25 pm Posted by : CHAITHANYA GALAM NEWS

తెలంగాణలో అల్లైడ్ & హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలి

  • కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డికి తెలంగాణ ఫిజియోథెరపిస్టుల వినతి

హైదరాబాద్, జూలై 18 (చైతన్యగళం): తెలంగాణలో అల్లైడ్ అండ్ హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ఫిజియోథెరపిస్టుల యూనియన్ ప్రతినిధులు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డిని శనివారం హైదరాబాద్‌లో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఫిజియోథెరపిస్టుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు డా. కందుల నాగరాజు మాట్లాడుతూ… రాష్ట్రంలో ఫిజియోథెరపిస్టులకు తగిన ప్రాధాన్యం లభించడం లేదని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫిజియోథెరపిస్టుల పోస్టులు పెద్ద సంఖ్యలో ఖాళీగా ఉన్నప్పటికీ వాటిని భర్తీ చేయడం లేదని పేర్కొన్నారు. ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ (IPHS) ప్రకారం ప్రతి జిల్లా ఆసుపత్రిలో కనీసం ఐదుగురు ఫిజియోథెరపిస్టులు ఉండాల్సిన అవసరం ఉందని, ప్రతి జిల్లా ఆసుపత్రిలో ప్రత్యేక ఫిజియోథెరపీ విభాగాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే తెలంగాణలో ఫిజియోథెరపీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ను స్థాపించడంతో పాటు, దేశవ్యాప్తంగా ఫిజియోథెరపీ పరిశోధనలను ప్రోత్సహించేలా జాతీయ స్థాయిలో ప్రత్యేక పరిశోధనా సంస్థను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

వినతిపత్రాన్ని స్వీకరించిన కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శితో ఈ అంశంపై చర్చించి, ఫిజియోథెరపిస్టులకు తగిన న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫిజియోథెరపిస్టుల యూనియన్ ప్రధాన కార్యదర్శి ప్రణీత్, కోశాధికారి గీత, ఉపాధ్యక్షులు సైదయ్య, అంబదాస్, సభ్యులు గ్రేస్, వర్మ, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.