ఆక్వా, పొగాకు రైతు సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని లోక్‌సభలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వెల్లడించారు.
అమరావతి, జులై 17(చైతన్యగళం): ఆక్వా, పొగాకు రైతు సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని లోక్‌సభలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వెల్లడించారు. శుక్రవారం ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ భేటీ జరిగింది. ఈ భేటీ అనంతరం ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. కేంద్ర ప్రాయోజిత పథకాలు సద్వినియోగం చేసుకునేలా సమగ్ర కార్యాచరణ రూపొందించుకుని కృషి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని తెలిపారు. సోషల్ మీడియా వేదికగా మహిళలపై జరుగుతున్న వ్యక్తిత్వ హననాన్ని తెలుగుదేశం పార్టీ సీరియస్‌గా తీసుకుందని వివరించారు. దీనిపై పార్లమెంట్ వేదికగా గళమెత్తుతామని చెప్పారు.
షెల్ కంపెనీలు పెట్టి మోసగించే అంశాలను కూడా పార్లమెంట్‌లో లేవనెత్తుతామని పేర్కొన్నారు. మహిళ రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులు సహా కేంద్రం పెట్టే వివిధ బిల్లులకు మద్ధతుగా నిలవాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు. మహిళ రిజర్వేషన్ బిల్లు వ్యతిరేకించిన ప్రతీ పార్టీ.. ఆయా రాష్ట్రాల ఎన్నికల్లో ఓడిపోవడం చూశామని అన్నారు. కాబట్టి ఈసారి ఆ పరిస్థితి ఉండదని భావిస్తున్నామని చెప్పారు. పోలవరం, అమరావతికి నిధుల సాధనకు కృషి చేయటంతో పాటు ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం కానున్న భోగాపురం విమానాశ్రయం అంశంపై చర్చించామని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు.
టీమ్ వర్క్‌గా పని చేస్తున్నాం: ఎంపీ కలిశెట్టి
రాష్ట్రంలోని పెండింగ్ సమస్యలపై మరింత దృష్టి పెట్టాలని తమకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. టీడీపీపీ భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు పెట్టిన బాధ్యతలు నెరవేర్చటానికి తామంతా టీమ్ వర్క్‌గా పని చేస్తున్నామని చెప్పారు. ఈ రెండేళ్లు పార్లమెంట్‌లో బాగా పని చేశారని సీఎం చెప్పారని పేర్కొన్నారు. దిల్లీ వేదికగా రాష్ట్ర పరువు తీయటమే లక్ష్యంగా వైఎస్ జగన్ పని చేశారని మండిపడ్డారు. రాష్ట్ర పరువు ఎలా తీయాలని వైఎస్ జగన్ చెబుతారంటూ వ్యంగ్యంగా అన్నారు. సీఎం చంద్రబాబు అభివృద్ధి కోసం మాట్లాడతారని తెలిపారు. కానీ వైఎస్ జగన్ పారిశ్రామిక వేత్తలను ఎలా తరమాలని చెబుతారని పేర్కొన్నారు.