CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 17 July 2026, 1:24 pm Posted by : rakeshkashaveni12@gmail.com

ఖాజీపూర్ ఇసుక క్వారీపై గ్రామస్తుల ఆందోళన

  • ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి గంగుల కమలాకర్ విమర్శలు – క్వారీ నిలిపివేయాలని డిమాండ్

కరీంనగర్ , జూలై 17 (చైతన్యగళం):

కొత్తపల్లి మండలం ఖాజీపూర్ గ్రామంలో ప్రభుత్వం అనుమతించిన ఇసుక క్వారీకి వ్యతిరేకంగా గ్రామస్తులు ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు. ఈ ఆందోళనలో మాజీ మంత్రి గంగుల కమలాకర్ పాల్గొని ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు.

ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ, ఇసుక క్వారీ కార్యకలాపాల వల్ల సాగు, తాగునీటి సమస్యలు తీవ్రమవుతున్నాయని ఆరోపించారు. మట్టి పేరుతో భారీగా ఇసుకను తరలించడం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని, ఖాజీపూర్‌తో పాటు ఎలగందుల, బద్దిపల్లి, నాగులమల్యాల గ్రామాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. నారుమళ్లు ఎండిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు.

క్వారీ సమస్యను పలుమార్లు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా చర్యలు చేపట్టలేదని విమర్శించిన ఆయన, రైతుల ప్రయోజనాల కంటే ప్రభుత్వానికి ఆదాయంపైనే దృష్టి ఉందన్నారు. తన సొంత పొలం కూడా సాగునీరు అందక ఎండిపోయిందని, గ్రామస్తుల కోసం ఎన్ని కేసులైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని చెప్పారు. వెంటనే ఇసుక క్వారీని నిలిపివేయాలని, లేకపోతే కరీంనగర్‌లో భారీ ధర్నా చేపడతామని హెచ్చరించారు.

అనంతరం సంఘటన స్థలానికి చేరుకున్న ఆర్డీవో రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు తమ ఆందోళనను విరమించారు.

ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, బీఆర్‌ఎస్ నాయకులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.