CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 17 July 2026, 2:20 pm Posted by : rakeshkashaveni12@gmail.com

స్టీల్ బ్యాంక్ విజయవంతంగా ఏడాది పూర్తి

  • రేగొండలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించిన మహిళా సంఘాలు

హుస్నాబాద్, జూలై 17 (చైతన్యగళం):

రేగొండలో గ్రామం లో ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో, పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్టు సహకారంతో ప్రారంభించిన స్టీల్ బ్యాంక్ కార్యక్రమం విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా అక్కన్నపేట మండలం రేగొండ గ్రామంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో స్టీల్ బ్యాంక్ తొలి వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మహిళా సంఘాల సభ్యులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. స్టీల్ బ్యాంక్ ద్వారా గ్రామంలో వివాహాలు, శుభకార్యాలు, అన్నదాన కార్యక్రమాల్లో ప్లాస్టిక్ పాత్రల స్థానంలో స్టీల్ పాత్రల వినియోగం పెరిగి, ప్లాస్టిక్ వ్యర్థాలు గణనీయంగా తగ్గాయని వారు తెలిపారు.

మహిళా సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ, స్టీల్ బ్యాంక్ గ్రామంలో పర్యావరణ పరిరక్షణకు ఎంతో దోహదపడుతోందని, ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్, పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్టుకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మూల చుక్కారెడ్డి, గ్రామ మహిళా సంఘం అధ్యక్షురాలు మెతుకు అశ్విని వీఓఏ బైకని నిర్మల, కార్యదర్శి మూల ప్రియాంక కోశాధికారి ఇర్రి వర్షిని మహిళా సంఘాల నాయకులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.