CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 17 July 2026, 10:31 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ప్రభుత్వ పాఠశాలలకు ప్రత్యేక గుర్తింపు లక్ష్యం

కరీంనగర్, జూలై 17 (చైతన్యగళం):

జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా తీర్చిదిద్ది, కరీంనగర్ జిల్లాకు విద్యారంగంలో రాష్ట్రస్థాయి ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

శుక్రవారం రాత్రి కలెక్టరేట్‌లో విద్యాశాఖపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎంఈఓలు, మోడల్ స్కూల్ ప్రిన్సిపాళ్లు, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లు, కోఆర్డినేటర్లతో కలెక్టర్ మాట్లాడారు. “ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూల్స్, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో విద్యార్థుల నమోదు గణనీయంగా పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలి” అని సూచించారు.

విద్యకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యారంగ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని కలెక్టర్ పేర్కొన్నారు. వినూత్న, విప్లవాత్మక మార్పులు జరుగుతున్న ఈ సమయంలో కరీంనగర్ జిల్లా ఆదర్శంగా నిలిచేలా అధికారులు కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, నాణ్యమైన బోధన, విద్యార్థులకు మెరుగైన వాతావరణం కల్పించడంలో ఎలాంటి రాజీ ఉండకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు.

పాఠశాలలను నిత్యం తనిఖీ చేస్తూ బోధన, హాజరు, మౌలిక వసతులు, విద్యార్థుల నమోదు వంటి అంశాలను నిరంతరం పర్యవేక్షించాలని ఆమె ఆదేశించారు. పాఠ్యపుస్తకాల పంపిణీ, యూనిఫాంల సరఫరా వంటి అంశాలను కూడా సమీక్షించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, జిల్లా విద్యాశాఖ అధికారి చైతన్య జైనీ, కోఆర్డినేటర్లు అశోక్ రెడ్డి, శ్రీనివాసు, ఉమారాణి శ్రీనివాసు, విద్యాశాఖ అధికారులు, ఎంఈఓలు, మోడల్ స్కూల్ ప్రిన్సిపాళ్లు, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.