CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 16 July 2026, 10:23 pm Posted by : CHAITHANYA GALAM NEWS

మహిళా సంఘాలపై సర్పంచ్ పెత్తనం ఎందుకు? – ఉపసర్పంచ్ సింగరయ్య

హుస్నాబాద్ , జూలై 16 (చైతన్యగళం):
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం సముద్రాల గ్రామంలో మహిళా సంఘాల వ్యవహారాల్లో గ్రామ సర్పంచ్ అట్ల శ్రీనివాస్ అనవసర జోక్యం చేసుకుంటూ సంఘాల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని గ్రామ ఉపసర్పంచ్ చింతకింది సింగరయ్య తీవ్ర ఆరోపణలు చేశారు.

బుధవారం ఐకేపీ కార్యాలయంలో జరిగిన ఘటనను ప్రస్తావిస్తూ, మహిళా సీఏ పట్ల సర్పంచ్ వ్యవహరించిన తీరు అభ్యంతరకరమని ఆయన విమర్శించారు. “మహిళా సంఘాల స్వతంత్రతను దెబ్బతీసే విధంగా బెదిరింపులకు దిగడం, అధికార దుర్వినియోగానికి పాల్పడడం సరికాదు. మహిళా సంఘాల సీఏలను తొలగించే అధికారం సర్పంచ్‌కు లేదు. ఏవైనా ఆరోపణలు ఉంటే సంబంధిత ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలి. విచారణ అనంతరం అధికారులు మాత్రమే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలి” అని సింగరయ్య స్పష్టం చేశారు.

గ్రామంలో ఇప్పటివరకు మహిళా సంఘాలు ఐక్యంగా పనిచేస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం అయ్యాయని, అయితే ఇటీవల సర్పంచ్ జోక్యం కారణంగా సంఘాల్లో అనవసర వివాదాలు, విభేదాలు నెలకొంటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. “మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తే సహించేది లేదు. మహిళా సంఘాలను రాజకీయ వేదికగా మార్చే ప్రయత్నాలను వెంటనే నిలిపివేయాలి. లేకపోతే మహిళా సంఘాల సభ్యులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేయడంతో పాటు ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమం చేపడతాం” అని హెచ్చరించారు.

ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొని మహిళా సంఘాల స్వతంత్రతను కాపాడాలని కోరారు.