CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 16 July 2026, 9:40 pm Posted by : rakeshkashaveni12@gmail.com

తాగునీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు 

  • అమృత్ పనులు వేగవంతం చేయాలి
  • వర్షపు నీటి సంరక్షణపై దృష్టి 
  • సీజనల్ వ్యాధుల నివారణకు ప్రతి శుక్రవారం డ్రైడే
  • సూపర్ ఎల్‌నినో నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలి

కరీంనగర్, జూలై 16 (చైతన్యగళం):

రాష్ట్రంలో తాగునీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం లేకుండా అత్యంత ప్రాధాన్యతతో చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. తాగునీటి సరఫరా, సీజనల్ వ్యాధుల నియంత్రణ, విద్యాశాఖ కార్యక్రమాలు, సూపర్ ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై గురువారం హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

కరీంనగర్ కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అశ్విని తానాజీ వాకడే పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎస్ సంజయ్ జాజు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వానికి తాగునీటి సరఫరా అత్యంత ప్రాధాన్య అంశమని పేర్కొన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రిజర్వాయర్లు, ప్రాజెక్టుల్లో తాగునీటికి అవసరమైన నీటి మట్టాలను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా తాగునీటి సమస్యలు తలెత్తితే వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ప్రజలకు నిరంతరాయంగా నీటి సరఫరా అందించాలని సూచించారు.

పట్టణ ప్రాంతాల్లో అమృత్ (AMRUT) పథకం కింద చేపడుతున్న తాగునీటి సరఫరా పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలకు నాణ్యమైన తాగునీరు అందేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

వర్షపు నీటి ప్రతి బొట్టును ఒడిసిపట్టేలా చెక్‌డ్యాంలు, ఇంకుడు గుంతలు, రీచార్జ్ పిట్స్, ఇతర నీటి సంరక్షణ నిర్మాణాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. భూగర్భ జలాలను పెంపొందించే చర్యలను గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విస్తృతంగా చేపట్టాలని సూచించారు.

కాలానుగుణ వ్యాధుల నివారణకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని, ప్రతి శుక్రవారం గ్రామాలు, పట్టణాల్లో తప్పనిసరిగా డ్రైడే నిర్వహించాలని ఆదేశించారు. దోమల వ్యాప్తి నివారణ, పారిశుద్ధ్య నిర్వహణ, నిల్వ నీటి తొలగింపు, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలను నిరంతరం చేపట్టాలని పేర్కొన్నారు.

విద్యాశాఖ అధికారులు విద్యార్థులకు అందించాల్సిన యూనిఫాంలలో కనీసం ఒక జతను ఆగస్టు 15 నాటికి పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు, పాఠ్యపుస్తకాలు, ఇతర సౌకర్యాలు అందుబాటులో ఉండేలా పర్యవేక్షించాలని ఆదేశించారు.

సూపర్ ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులను ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు ప్రోత్సహించాలని, ఆయా పంటలకు అవసరమైన విత్తనాలను ముందుగానే సిద్ధం చేసి అందుబాటులో ఉంచాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల వారీగా రైతులకు అవగాహన కల్పించి పంటల ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.

వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో తాగునీటి సరఫరా, సీజనల్ వ్యాధుల నియంత్రణ, పారిశుద్ధ్య కార్యక్రమాలు, అమృత్ పనుల పురోగతి, ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహంపై సమగ్ర కార్యాచరణ అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ లక్ష్యాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.

ఈ సమావేశంలో జిల్లా ప్రణాళిక అధికారి దత్తారాం రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, జిల్లా విద్యాశాఖ అధికారి చైతన్య జైనీ, బీసీడీఓ అనిల్ ప్రకాష్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీరామ్, డీఎస్‌ఓ నర్సింగరావు, గ్రామీణ నీటి సరఫరా శాఖ ఈఈతో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.