హైదరాబాద్, జూలై 16 (చైతన్యగళం): బీజేవైఎం పూర్వ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, “పేద, బడుగు, బలహీన వర్గాలకు ఉన్నత విద్యను అందించాలనే సదుద్దేశంతో 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభమైన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం వేలాది విద్యార్థులకు వరంగా మారింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని నీరుగారుస్తూ విద్యార్థుల భవిష్యత్తును చీకట్లోకి నెడుతోంది” అని తీవ్రంగా విమర్శించారు.
ఆయన పేర్కొంటూ, “తెలంగాణలో దాదాపు 90 శాతం మంది విద్యార్థులు ఈ పథకంపై ఆధారపడి చదువుకుంటున్నారు. గత నాలుగైదు సంవత్సరాలుగా రూ.10,000 కోట్ల బకాయిలు పేరుకుపోయినా, ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు చదువును మధ్యలో వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు కాలేదు. ట్రస్ట్ ఏర్పాటు చేస్తామని, సీఎస్ఆర్ ఫండ్‌తో నడుపుతామని చెప్పి కాలం గడిపేస్తున్నారు” అని ఆరోపించారు.
ప్రవీణ్ కుమార్ అన్నారు, “నిధులు ఇవ్వకుండా కాలేజీలను బెదిరించడం, తనిఖీల పేరుతో మభ్యపెట్టడం విద్యార్థులపై దాడి చేయడమే. ఫీజులు క్లియర్ చేయకపోతే సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని కాలేజీలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో పీజీ అడ్మిషన్లు, ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్న విద్యార్థులు నిరాశలో ఉన్నారు. తాజాగా జీవో నెంబర్ 7తో స్కాలర్షిప్ నేరుగా విద్యార్థుల ఖాతాలో జమ చేస్తామని చెప్పి, వాస్తవానికి పథకాన్ని శాశ్వతంగా ఎత్తివేయాలనే కుట్ర జరుగుతోంది” అని మండిపడ్డారు.
ఆయన హెచ్చరిస్తూ, “ప్రభుత్వం ఇప్పటికైనా బకాయిలను విడుదల చేసి పేద విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి. లేకపోతే విద్యార్థుల ఆగ్రహాన్ని కాంగ్రెస్ సర్కార్ తప్పక ఎదుర్కోవాల్సి వస్తుంది” అని స్పష్టం చేశారు.