తిమ్మాపూర్, జూలై 16 (చైతన్యగళం):
కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ మండలం రేణికుంట టోల్‌గేట్ సమీపంలోని ఒక రైస్‌మిల్లులో నిబంధనలకు విరుద్ధంగా బియ్యాన్ని రీసైకిలింగ్ చేస్తున్నారని ఆరోపిస్తూ, తెలంగాణ రక్షణ సేన జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ జిల్లా అదనపు కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఆయన మాట్లాడుతూ, “గత ప్రభుత్వ హయాంలో మిగిలిన బియ్యాన్ని అక్రమంగా టెండర్‌లో దక్కించుకున్న మిల్లర్, అనుమతులు లేకుండా అర్ధరాత్రి సమయంలో నిల్వల నుండి తరలించి రీపాలిషింగ్ చేసి మార్కెట్లో విక్రయిస్తున్నాడు. ఇథనాల్ తయారీకి లేదా పశుగ్రాసానికి ఉపయోగించాల్సిన బియ్యాన్ని మాఫియా ముఠా అక్రమ మార్గాల్లో రీసైకిల్ చేస్తూ ప్రభుత్వ నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘిస్తోంది” అని ఆరోపించారు.
హరిప్రసాద్ పేర్కొంటూ, “ఈ బియ్యాన్ని రీపాలిష్ చేసి ఎఫ్‌సిఐకి సరఫరా చేయాలనే పక్క పథకం రచించారు. జిల్లా పౌరసరఫరాల శాఖ, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తక్షణమే విచారణ జరిపి, నిల్వ చేసిన బియ్యాన్ని సీజ్ చేసి, అక్రమ రీసైకిలింగ్ చేస్తున్న వారిపై పీడీ యాక్ట్ పెట్టాలి. చిన్న రైస్‌మిల్లులను ప్రభుత్వం కాపాడాలి” అని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మ్యాకల తిరుపతి, అధివాసి విభాగం జిల్లా అధ్యక్షుడు కుతాడి శ్రీనివాస్, సీనియర్ నాయకులు రంగరవేణి లక్ష్మణ్, బాసవేణి రజేందర్, మ్యాక వినోద్, నూతి చరణ్ తదితరులు పాల్గొన్నారు.