CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 16 July 2026, 5:20 pm Posted by : CHAITHANYA GALAM NEWS

డీలిమిటేషన్‌తో ఏ రాష్ట్రానికీ నష్టం జరగదు: బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్

వికసిత భారత్ – 2047 లక్ష్యంతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ వెల్లడించారు. గురువారం న్యూఢిల్లీలో ఆయన మాట్లాడారు. దేశంలో అభివృద్ధి, సంస్కరణల ఎజెండాపై సభలో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

న్యూఢిల్లీ, జులై 16(చైతన్యగళం): వికసిత భారత్ – 2047 లక్ష్యంతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ వెల్లడించారు. గురువారం న్యూఢిల్లీలో ఆయన మాట్లాడారు. దేశంలో అభివృద్ధి, సంస్కరణల ఎజెండాపై సభలో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా ప్రతినిధిగా 25 ఏళ్లు పూర్తయ్యాయని గుర్తు చేశారు. ఇది అభివృద్ధి పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. డిజిటల్ ఇండియా నుంచి ఆత్మనిర్భర్ భారత్ వరకు చారిత్రక నిర్ణయాలు తీసుకున్నారని వివరించారు.

మహిళా రిజర్వేషన్ బిల్లుతో వారి సాధికారతకు ఊతం అవుతుందని బీజేపీ ఎంపీ చెప్పారు. మహిళా బిల్లుతోపాటు డీలిమిటేషన్‌ను ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని విమర్శించారు. డీలిమిటేషన్‌తో ఏ రాష్ట్రానికీ నష్టం జరగదని స్పష్టం చేశారు. ప్రస్తుత సీట్లు తగ్గకుండా 50 శాతం వరకు పెంపునకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు. ఒకే దేశం – ఒకే ఎన్నిక దేశ ప్రయోజనాల కోసమేనని తెలిపారు. అవినీతి నిరోధక చట్టాలకు మద్దతు ఇవ్వాలని ప్రతిపక్షాలకు ఆయన సూచించారు.

జేపీసీ నివేదిక తర్వాత కీలక బిల్లులపై ముందడుగు పడుతుందని ఎంపీ లక్ష్మణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. రైతులు, మహిళలు, యువత అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. తెలంగాణలోని పెండింగ్ ప్రాజెక్టులపై పార్లమెంట్‌లో స్వరం వినిపిస్తామని అన్నారు. తెలంగాణకు కేంద్రం భారీగా నిధులు, అభివృద్ధి ప్రాజెక్టులు ఇచ్చిందని ఆయన వివరించారు.

ఈ వర్షాకాల సమావేశాల్లో సభను అడ్డుకోవద్దని.. చర్చల్లో పాల్గొనాలని ప్రతిపక్షాలకు ఆయన స్పష్టం చేశారు. దేశ ప్రయోజనాలే అందరికీ అత్యున్నత ప్రాధాన్యత కావాలని తెలిపారు. వర్షాకాల సమావేశాలు దేశాభివృద్ధికి కొత్త దిశానిర్దేశం చేస్తాయని పేర్కొన్నారు. పార్లమెంట్‌లో అన్ని అంశాలపై చర్చలకు సిద్ధంగా ఉన్నామని బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ వివరించారు.