CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 16 July 2026, 9:54 pm Posted by : CHAITHANYA GALAM NEWS

టీజీ-20 విజేతలతో సీఎం రేవంత్ భేటీ

కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడా రంగ అభివృద్ధిపై స్పష్టమైన కార్యాచరణతో ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. టీజీ-20 పోటీల్లో విజయం సాధించిన క్రీడాకారులతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గెలుపొందిన ఆటగాళ్లను అభినందిస్తూ తెలంగాణకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.

హైదరాబాద్(చైతన్యగళం): కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడా రంగ అభివృద్ధిపై స్పష్టమైన కార్యాచరణతో ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ క్రీడాకారులంతా భారతదేశ ప్రతిష్ఠను పెంచే స్థాయి ఆటగాళ్లుగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. MCRHRDలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టీజీ-20 లీగ్ విజేత హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ జట్టు మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా గెలుపొందిన ఆటగాళ్లను ముఖ్యమంత్రి అభినందిస్తూ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం తెలంగాణకు మంచి పేరు తీసుకురావాలని క్రీడాకారులకు రేవంత్ సూచించారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రానికి ప్రత్యేక క్రీడా విధానాన్ని (స్పోర్ట్స్ పాలసీ) రూపొందించామని పేర్కొన్నారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచిన వారికి నగదు ప్రోత్సాహకాలు మాత్రమే కాకుండా ప్రభుత్వ ఉద్యోగాలూ కల్పిస్తున్నామని అన్నారు. వారిని అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. క్రీడలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపైనా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రేవంత్ తెలిపారు. గతంలో జాతీయ స్థాయి క్రీడలకు హైదరాబాద్ వేదికగా నిలిచిందని గుర్తు చేశారు. భవిష్యత్తులోనూ రాష్ట్రాన్ని క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. ఇందులో భాగంగా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అలాగే గచ్చిబౌలి స్టేడియాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

ఏ రంగంలోనైనా విజయం సాధించాలంటే స్పష్టమైన లక్ష్యం, ఏకాగ్రత అవసరమని ఈ సందర్భంగా క్రీడాకారులకు రేవంత్ రెడ్డి సూచించారు. ఎంచుకున్న రంగంపై గౌరవం, ఆసక్తి ఉంటేనే ఉన్నత స్థాయికి చేరుకోగలమని అన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికితీసేందుకు టీజీ-20 మంచి వేదికగా నిలుస్తోందని సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు. ఈ పోటీల్లో విజయం సాధించిన క్రీడాకారులందరికీ ఆయన మరోసారి అభినందనలు తెలియజేశారు. భవిష్యుత్తులో అంతర్జాతీయ స్థాయిలో రాణించి తెలంగాణతో పాటు దేశానికి కీర్తి తీసుకురావాలని సీఎం రేవంత్ ఆకాంక్షించారు.