CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 15 July 2026, 8:48 pm Posted by : CHAITHANYA GALAM NEWS

సముద్ర ఓడరేవులను రక్షించుకోవడానికి సాధ్యమైనదంతా చేస్తాం: ఉక్రెయిన్

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరోసారి తీవ్రరూపం దాల్చిన వేళ ఉక్రెయిన్ కీలక ప్రకటన చేసింది. తమ సముద్ర రేవులను కాపాడుకోవడానికి, ప్రపంచ ఆహార భద్రతకు భరోసా ఇస్తూ ధాన్యాల ఎగుమతులను కొనసాగించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తామని చెప్పింది.

ఆంధ్రజ్యోతి, జులై 15(చైతన్యగళం): రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరోసారి తీవ్రరూపం దాల్చింది. ఈసారి రష్యా సైన్యం ఉక్రెయిన్‌కు చెందిన కీలకమైన నల్లసముద్రం (Black Sea) రేవులపై, ఆహార ధాన్యాల ఎగుమతి నౌకలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఈ తీవ్ర సవాళ్ల నడుమ… తమ సముద్ర రేవులను కాపాడుకోవడానికి, ప్రపంచ ఆహార భద్రతకు భరోసా ఇస్తూ ధాన్యాల ఎగుమతులను కొనసాగించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తామని ఉక్రెయిన్ ప్రకటించింది.

రేవుల రక్షణే ప్రాధాన్యం

రష్యా దాడులు తీవ్రతరం చేసినప్పటికీ, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను కొనసాగించడమే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని ఉక్రెయిన్ డిప్యూటీ ఆర్థిక మంత్రి తారస్ వైసోత్స్కీ స్పష్టం చేశారు. ‘పరిస్థితి చాలా కష్టంగా ఉంది. అయినప్పటికీ, అంతర్జాతీయ ఆహార భద్రతకు ఎటువంటి ముప్పు వాటిల్లకుండా ఉండేందుకు.. కనీసం గత ఏడాది స్థాయికి తగ్గకుండా ఎగుమతులను సురక్షితంగా కొనసాగించడానికి మేము చేయగలిగినదంతా చేస్తాం’. అని ఆయన స్పష్టం చేశారు.

రష్యా దాడుల కంటే ముందుగా, జూలై నుంచి ప్రారంభమైన 2026/27 సీజన్‌లో ఉక్రెయిన్ దాదాపు 43 మిలియన్ మెట్రిక్ టన్నుల ధాన్యాలను ఎగుమతి చేయాలని అంచనా వేసింది. గత ఏడాది ఉక్రెయిన్ 37 మిలియన్ టన్నులకు పైగా ధాన్యాలను విజయవంతంగా ఎగుమతి చేసింది.

మూడో వంతు ఎగుమతి సామర్థ్యం ధ్వంసం

ఉక్రెయిన్ ప్రధాన రైతు సంఘం ‘యూఏసీ’ (UAC) వెల్లడించిన వివరాల ప్రకారం, రష్యా ఉధృతం చేసిన క్షిపణి, డ్రోన్ దాడుల కారణంగా నల్లసముద్రం రేవుల ద్వారా ధాన్యాన్ని ఎగుమతి చేసే సామర్థ్యంలో ఉక్రెయిన్ ఇప్పటికే దాదాపు మూడో వంతు కోల్పోయింది.

నాలుగు సంవత్సరాలుగా సాగుతున్న ఈ యుద్ధంలో ఉక్రెయిన్‌కు విదేశీ కరెన్సీని తెచ్చిపెట్టే అతిపెద్ద వనరు వ్యవసాయ ఉత్పత్తులే (ధాన్యాలు, వెజిటబుల్ ఆయిల్స్). ఇందులో 90 శాతానికి పైగా ఎగుమతులు దక్షిణ ఒడెస్సా ప్రాంతంలోని మూడు ప్రధాన రేవుల ద్వారానే సాగుతాయి. రష్యా దాడుల భయంతో ఉక్రెయిన్‌లోని 13 పెద్ద ధాన్యపు ఎగుమతి టర్మినల్స్‌లో 4 టర్మినల్స్ ఇప్పటికే ధాన్యాల కొనుగోళ్లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. దాడుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో, కొన్ని నౌకల యజమానులు తమ నౌకలను ఉక్రెయిన్ రేవుల్లోకి పంపేందుకు నిరాకరిస్తున్నారు.

ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ దేశాలు పరస్పరం ఆర్థిక మూలాలను దెబ్బతీసే వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. ఒకవైపు ఉక్రెయిన్ సైన్యం రష్యాకు చెందిన చమురు ట్యాంకర్లు, ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తుండగా.. దానికి ప్రతిగా రష్యా నల్లసముద్రపు రేవులపై దాడులను గత కొన్ని వారాలుగా గణనీయంగా పెంచింది. బుధవారం కూడా ఒడెస్సా, మైకోలైవ్ ప్రాంతాల్లోని పోర్టు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై రష్యా మరోసారి దాడులకు తెగబడినట్లు స్థానిక అధికారులు ధ్రువీకరించారు.