CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 15 July 2026, 5:31 pm Posted by : CHAITHANYA GALAM NEWS

గాన కోకిల జానకికి ఘన నివాళి

  • సిరిసిల్లలో సాహితీ సమితి ఆధ్వర్యంలో కార్యక్రమం

రాజన్న సిరిసిల్ల, జూలై 15 (చైతన్యగళం): ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజన్న సిరిసిల్లలో గాన కోకిల ఎస్. జానకికి ఘన నివాళి అర్పించారు. జిల్లా సాహితీ సమితి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డాక్టర్ జనపాల శంకరయ్య, ప్రధాన కార్యదర్శి వెంగళ లక్ష్మణ్ నిర్వహణలో, ముఖ్య అతిథిగా ఆకునూరి శంకరయ్య, ఆత్మీయ అతిథిగా ఆధ్యాత్మిక కవి మద్దెల భూమయ్య పాల్గొన్నారు.

డాక్టర్ జనపాల శంకరయ్య మాట్లాడుతూ, “సినీ ప్రపంచంలో వినీలాకాశంలో గాన కోకిలగా ఎన్నో అవార్డులు అందుకున్న జానకి బాల్యం సిరిసిల్లలో గడిచింది. ఆమెకు ఘన నివాళి అర్పించడం మనందరి గౌరవం” అని అన్నారు. ఆకునూరి శంకరయ్య మాట్లాడుతూ, “జానకి తండ్రి ఆయుర్వేద వైద్యుడు. సిరిసిల్ల పట్టణ దేశాయ్ ఆశ్రయం ఇచ్చినందువల్ల వారు ఇక్కడే స్థిరపడ్డారు” అని గుర్తుచేశారు.

ప్రధాన కార్యదర్శి వెంగళ లక్ష్మణ్ మాట్లాడుతూ, “బాల్యంలోనే బాలనాగమ్మ సినిమా కోసం వేములవాడకు వెళ్లి చూసి గానం ప్రారంభించింది. తరువాత స్థల మార్పు కారణంగా దక్షిణ భారతదేశంలో తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో అనేక పాటలు పాడిన ఘనత ఆమెకు దక్కింది” అని వివరించారు.

ఉపాధ్యక్షుడు బూర దేవానందం కవితను ఆలపిస్తూ, “జానకి మరణం ప్రపంచానికి తీరని లోటు” అని అన్నారు. యువ కవి సిరిసిల్ల తిరుపతి, ఆధ్యాత్మిక కవి రామస్వామి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.