CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 15 July 2026, 8:52 pm Posted by : CHAITHANYA GALAM NEWS

డ్రగ్స్‌ను అరికట్టేందుకు విద్యాసంస్థల్లో ప్రత్యేక నిఘా.. డీజీపీ ఆదేశాలు

విద్యాసంస్థల్లో డ్రగ్స్‌పై జీరో టాలరెన్స్ విధానం అమలు చేయాలని ఈగల్ విభాగంలోని అధికారులకు తెలంగాణ డీజీపీ సి.వి. ఆనంద్ స్పష్టం చేశారు. డ్రగ్స్ నిరోధించడంపై బుధవారం హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో ఈగల్ అధికారులతో సి.వి. ఆనంద్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.

హైదరాబాద్, జులై 15(చైతన్యగళం): విద్యాసంస్థల్లో డ్రగ్స్‌పై జీరో టాలరెన్స్ విధానం అమలు చేయాలని ఈగల్ విభాగంలోని అధికారులకు తెలంగాణ డీజీపీ సి.వి. ఆనంద్ స్పష్టం చేశారు. డ్రగ్స్ నిరోధించడంపై బుధవారం హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో ఈగల్ అధికారులతో సి.వి. ఆనంద్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో ‘యాంటీ డ్రగ్స్ అండ్ సేఫ్టీ కమిటీలు’ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రతి విద్యాసంస్థలో క్యాంపస్ సేఫ్టీ కో ఆర్డినేటర్ నియామకం తప్పనిసరిగా చేపట్టాలని సూచించారు. డ్రగ్స్ నిబంధనలు ఉల్లంఘించే విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని.. అవసరమైతే గుర్తింపును రద్దు చేసేందుకు సిఫార్సు చేయాలని పేర్కొన్నారు.

విద్యార్థుల భద్రతతోపాటు డ్రగ్స్ నివారణ చర్యలపై సేఫ్టీ కమిటీలు ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. డ్రగ్స్ నియంత్రణలో పోలీసు, విద్య, ఆరోగ్య శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను డీజీపీ సి.వి. ఆనంద్ ఆదేశించారు. విద్యార్థులకు సైకాలజిస్టులు, కౌన్సెలర్ల సేవలను అందుబాటులోకి తీసుకురావాలని పేర్కొన్నారు. అలాగే తల్లిదండ్రుల భాగస్వామ్యంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వివరించారు.

పోలీసు, విద్య, ఆరోగ్య శాఖల సమన్వయంతో డ్రగ్స్ రహిత తెలంగాణే లక్ష్యమని తెలంగాణ డీజీపీ సి.వి. ఆనంద్ తెలిపారు. డ్రగ్స్ రహిత విద్యాసంస్థల కోసం త్వరలోనే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (SOPs) విడుదల చేయనున్నారు. ప్రభుత్వానికి తుది ప్రతిపాదనలు సమర్పించే ముందు మరోసారి సమీక్ష సమావేశం నిర్వహించాలని ఈ సందర్భంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిల్య, ఐజీ పద్మజా రెడ్డి, ఎస్పీ గిరిధర్‌తోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.