CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 15 July 2026, 9:00 pm Posted by : CHAITHANYA GALAM NEWS

దళిత క్రైస్తవుల హక్కుల సాధనకు ఐక్యంగా ఉద్యమించాలి– డీసీహెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గుమ్మకొండ రాజు

ఆమనగల్లు, జూలై 15 (చైతన్యగళం):
దళిత క్రైస్తవుల రాజ్యాంగబద్ధ హక్కుల పరిరక్షణ, సమాన హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఉద్యమించాలని దళిత క్రైస్తవుల హక్కుల పోరాట సమితి (డీసీహెచ్‌పీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు గుమ్మకొండ రాజు పిలుపునిచ్చారు. ఈ నెల 17వ తేదీ శుక్రవారం ఉదయం 11 గంటలకు మహబూబ్‌నగర్‌లోని జేజేఆర్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించనున్న దళిత క్రైస్తవుల రాష్ట్రస్థాయి మహా గర్జన సభను విజయవంతం చేయాలని ఆయన బుధవారం ఒక ప్రకటనలో కోరారు. దశాబ్దాలుగా దళిత క్రైస్తవులు రాజ్యాంగం కల్పించిన హక్కులు, సంక్షేమ పథకాల అమలులో వివక్షకు గురవుతున్నారని, వారి సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా ఐక్య ఉద్యమం అవసరమని అన్నారు. దళిత క్రైస్తవులకు సమాన హక్కులు, రిజర్వేషన్లు, సంక్షేమ పథకాల అమలు, సామాజిక న్యాయం సాధనే మహా గర్జన సభ ప్రధాన లక్ష్యమని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి దళిత క్రైస్తవులు, ప్రజాసంఘాల ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని గుమ్మకొండ రాజు విజ్ఞప్తి చేశారు. ఈ మహాసభ దళిత క్రైస్తవుల హక్కుల సాధనలో కీలక మలుపు కానుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.