CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 15 July 2026, 3:51 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ఫ్యూచర్ సిటీకి స్టెప్పింగ్ స్టోన్‌‌గా అమెజాన్ డేటా సెంటర్: సీఎం రేవంత్

2047 కల్లా 3 ట్రిలియన్ ఎకానమీకి చేరుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. భారత జీడీపీకి 10శాతం అందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

హైదరాబాద్, జులై 15(చైతన్యగళం): ఫ్యూచర్ సిటీలో అమెజాన్ కొత్త డేటా సెంటర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. 2047 కల్లా 3 ట్రిలియన్ ఎకానమీకి చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. భారత జీడీపీకి 10శాతం అందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. కాలుష్యరహిత నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని చెప్పారు. నగరంలో ఉన్న పరిశ్రమలను బయటకు తరలిస్తామన్నారు. మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ చేపట్టామని, డీజిల్ నుంచి ఈవీలుగా బస్సులను మారుస్తామని వెల్లడించారు. ఈవీ వాహనాల రిజిస్ట్రేషన్‌లో జీరో ట్యాక్స్ అమలు చేస్తున్నామని అన్నారు. ఫార్చ్యూన్ కంపెనీలకు హబ్‌గా హైదరాబాద్ మారనుందని, ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన నగరాన్ని నిర్మిస్తున్నామని వెల్లడించారు.

పరిశ్రమలకు సింగిల్ విండో ద్వారా అనుమతులు ఇస్తున్నామని, పారిశ్రామికవేత్తలకు అనేక రకాల ప్రోత్సాహకాలు అందిస్తున్నామని సీఎం చెప్పుకొచ్చారు. ప్రతి రంగానికి ప్రత్యేక పాలసీలు రూపొందించామని తెలిపారు. పాలసీలపై ఎప్పటికప్పుడు రివ్యూలు నిర్వహిస్తున్నామన్నారు. ఫ్యూచర్ సిటీకి అమెజాన్ డేటా సెంటర్ స్టెప్పింగ్ స్టోన్‌గా ఉంటుందన్నారు. ఫ్యూచర్‌ సిటీకి రాబోయే రోజుల్లో మరిన్ని పెట్టుబడులు రానున్నాయని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాగా, ఫ్యూచర్ సిటీలో 202 ఎకరాల్లో అమెజాన్ డేటా సెంటర్ నిర్మాణం జరగనుంది.12 ఏళ్లలో రూ.60వేల కోట్లను అమెజాన్ వెచ్చించనుంది. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణా రావు, వాకిటి శ్రీహరి, శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సలహాదారు రామకృష్ణా రావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.