CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 14 July 2026, 7:56 pm Posted by : CHAITHANYA GALAM NEWS

జగిత్యాలను పరిశుభ్రమైన పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యం – ఎమ్మెల్యే సంజయ్ కుమార్

జగిత్యాల, జూలై 14 (చైతన్యగళం):
జగిత్యాలను పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన పట్టణంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఈరోజు మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల కార్యాచరణలో భాగంగా జగిత్యాల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ భారత్ అవగాహన సదస్సులకు దేశ స్థాయిలో గుర్తింపు లభించడం గర్వకారణమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పాలకవర్గ సభ్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ పార్టీలకు అతీతంగా సమిష్టిగా పనిచేస్తూ పట్టణాన్ని పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన నగరంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.

చెరువులను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన గుర్తుచేస్తూ, అమృత్ (AMRUT) పథకం ద్వారా మంజూరైన నిధులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. SIR ప్రక్రియలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలందరూ భాగస్వాములు కావాలని, సందేహాలు ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించాలని కోరారు.

మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ మాట్లాడుతూ, పట్టణంలో మెరుగైన మౌలిక వసతుల కల్పనతో సమగ్ర అభివృద్ధి సాధించడమే తమ లక్ష్యమని తెలిపారు. రూ. 6.13 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి పనులకు కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందని, ఎమ్మెల్యే సహకారంతో నిధులను త్వరితగతిన మంజూరు చేయించి పనులు చేపడతామని పేర్కొన్నారు.

ఇటీవల మున్సిపల్ కమిషనర్ పేరుతో జరిగిన ఫోర్జరీ ఆధారిత రిజిస్ట్రేషన్ ఘటనపై మాట్లాడుతూ, పాలకవర్గం దీనిని ఖండిస్తోందని, కేసు దర్యాప్తులో మున్సిపాలిటీ పూర్తిస్థాయిలో సహకరిస్తుందని స్పష్టం చేశారు. బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

సమావేశంలో రోడ్ల గుంతలు పూడ్చడం, డ్రైన్లు శుభ్రపరచడం, పబ్లిక్ టాయిలెట్ల వినియోగం కోసం నిధులు మంజూరు చేయాలని నిర్ణయించారు. అనంతరం జాతీయ జల మిషన్ కార్యక్రమంలో భాగంగా సభ్యులందరూ నీటి సంరక్షణపై ప్రతిజ్ఞ చేశారు.

ఈ సమావేశంలో కమిషనర్ సత్య ప్రణవ్, మున్సిపల్ కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.